పైని వర్ణించినటు లనేక కణమయమగు జంతువు చేతన సృష్టికి శిరోభూషణమనం దగు మానవుని గా మారుటకు నెన్నియో లక్షలు కోట్లుసంవత్సరములు పట్టినవి. ఇది నూఱు సంవత్సరములలో గాని వేయిసంవత్సరములలో గాని యైన పనిగాదు.
ఇంతవఱకు మేము పరిణామ వాదమును గుఱించి చెప్పిన యంశములకు రుజు వేమైనను కలదా యని చదువరు లడుగవచ్చును. ఇందుకు శాస్త్రజ్ఞులు నలుబది యేబది సంవత్సరములనుండి మిక్కిలి శ్రమపడి, మీకేమి తెలియును? మీకేమి తెలియును? అని గుట్టను, చెట్టును, రాతిని, మృత్తికను, సముద్రమును, జంతువులను, మఱియు భూమి మీది చేతనాచేతనాత్మకమైన సమస్తపదార్థములను అడిగి యడిగి ప్రబలమైన ముగ్గురు సాక్షులను సంపాదించిరి. ఈ ముగ్గురుసాక్షులు నమ్మదగిన వారును, ఒకరితోనొకరికి సంబంధము లేనివారును అయియున్నారు. వా రెవరంటిరేని:-
1. భూగర్భ శాస్త్రము (Geology)
భూమిని త్రవ్విన కొలదిని అందు పొరల క్రింద బొరలు కానవచ్చును. భూమి క్రమముగా బెరిగినందున నిట్టిపొర లేర్పడినవి. క్రిందికి బోయిన కొలదిని పైపొరకంటె గ్రింది పొర పురాతన కాలమును జూపుననుట విదితము. ఆయా పొరలలో ఆకాలమునందు నుండిన వృక్షముల యొక్కయు, జంతువులయొక్కయు శిలారూపమయిన (Fossil) దేహములు కానవచ్చు చున్నవి. వానివలన జంతువులు క్రమక్రమముగా నెట్లు శరీరరచనలో మారినదియు బాగుగ దెలిసికొనవచ్చును. ఈ శిలారూపముల విశేష స్వరూపము, అందువలన మనము చేయదగు అనుమానములు మొదలయిన వానిని గుఱించి మేము ప్రకటింపబోవు భూగర్భశాస్త్రములో బటములతో మిక్కిలి వివరముగా వర్ణింపబడును.
2. పిండోత్పత్తిశాస్త్రము
(Embriology)
గర్భధారణ సమయమునుండి జననము వఱకు పిండముయొక్క మార్పులను గనిపెట్టి వర్ణించెడి శాస్త్రమునకు పిండోత్పత్తిశాస్త్రమని పేరు. ఈశాస్త్ర