పుట:Jeevasastra Samgrahamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణాది క్రియలు చేసికొనుచుండును. ఇ ట్లివి తమ జీవనక్రియలు స్వతంత్రముగా జరుపుకొనుచున్నను, ఒక్కచోట గలసి యున్నందున వీని సంఘమును జూచి శత్రువులు వీనిపైకి సాహసించిరా నేరవు. ఇతర యాదిభౌతిక బాధలును వీనిని అంతగా బాధింపవు. నాచు ప్రవాళ కీటకములు గుంపులుకూడి యొక్కచో నున్నందున నీళ్లకుగొట్టుకొనిపోక నిలిచియుండును. అందుకే 'సంఘే శక్తి:' అను వచనముపుట్టినది. స్పాంజుకీటకములుగూడ పైకీటకముల వంటివే. ఈజీవులు వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని కొంతకాలము వఱకు శాస్త్రజ్ఞులకు సంశయముండెను. కాని యవి యేకకణమయము లయిన యాదిజంతువుల లోనివే యని. యిప్పుడు నిశ్చయ మైనది. బాజారులో దొరుకు స్పాంజు, ఇట్టిలీటకములయిల్లు. ఈకీటకములు తన జీవనవ్యాపారములన్నియు స్వతంత్రముగా జేసికొను చున్నప్పటకి, అన్నిటికి గావలసిన నీటిని తమ యింటిలోనికి దెచ్చుటయు, అక్కరలేని నీటిని వెలుపలకు బంపుటయు, అను క్రియలన్నియు గలిసిచేయును.

ఒక కణము అనేక కణములుగా జీలి యీకణములన్నియు నొకటితో నొకటికి సంబంధము లేకుండ విడివిడిగా నున్న యెడల ఎన్నటికిని హెచ్చు తరగతి జీవులు పుట్టియుండవు. కొంత కాలమునకు, ఒక కణము చీలి యేర్పడిన యనేక కణములు విడిపోయి స్వతంత్రముగా నుండుట మాని కలిసి యొకటి గానుండును. ఇట్లుండుటయేగాక జీవనమునకై కావలసిన వ్యాపారము లన్నియు అన్ని కణములు చేయుటమాని, కొన్ని కణములు కొన్ని వ్యాపారములును, మఱి కొన్ని కణములు మఱి కొన్ని వ్యాపారములును చేయబూని యీకణములన్నియు గూడి యొక్కజీవియగును. వెలుపల నున్న కణములు శీతోష్ణముల యెడతెగని సహవాసముచే గట్టివై వెలుపలిచర్మముగ నేర్పడును. లోనివి మృదువుగ నుండును. జీవనమునకు గావలసిన పదార్థములను వెలుపలనుండి సంపాదించు పని కొన్ని కణములపై బడినందున నవి క్రమక్రమముగా హస్తాదికర్మేంద్రియములుగా మారును. లోనికణములకు ఆహారముజీర్ణము చేయుపని ప్రాప్తించుటచే