పోలికల ననుసరించి విద్వాంసులు కనిపెట్టియున్నారు. లోపలి ఎముకలను చక్కగ బరిశోధించి, చెపయొక్క ఱెక్కలును, పక్షుల రెక్కలును, చతుష్పాత్ జంతువుల ముందరి కాళ్లును, మానవుల చేతులును నిర్మాణ విధియందు నొక దాని కొకటి బంధువులనియే శాస్త్రజ్ఞులును నిశ్చయించియున్నారు. ఈప్రకారము సమస్తజంతువులయొక్కయు, వృక్షములయొక్కయు శరీర రచనను పరీక్షించి వాని నన్నిటిని వేఱువేఱు నంశములుగా చర్గీకరణము (Classification) చేసి యున్నారు. ఈ వేఱువేఱు నంశములకును ఎడతెగని సంబంధము గలదు. అందుచే గొన్ని యీవంశములోనివా లేక యావంశములోనివా యనికూడ జెప్పుటకు వీలులేదు. ఇంతియకాదు. కొన్ని జీవులు వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని నిశ్చయముగ జెప్పుటకు వీలులేదు. ఇట్లు సమస్త జీవులును ఒక దానితో నొకటి యెడ తెగని సంబంధము గలిగియున్నవి. వేఱువేఱుగ స్వతంత్రించిలేవు.
ఈ యుత్క్రాంతి వాదములో నింకొక యంశము జక్కగ జ్ఞాపకముంచుకొనవలయును. ప్రస్తుతము మనకు భూమిపై గానవచ్చెడి వృక్షములుగాని జంతువులుగాని యల్లప్పుడును ఇప్పటి శరీరాకారమే కలిగియుండలేదు. వీని శరీర రచనలో గ్రమక్రమముగా మార్పులు గలుగుచు వానికి బ్రస్తుతపు ఆకారమువచ్చినది. ఇందుకు నుదాహరణముగా గుఱ్ఱమునుగుఱించి విచారింతము. ప్రస్తుతము గానవచ్చెడి గుఱ్ఱముల కాలికి నొక్క డెక్కయే కానవచ్చును. కాని యెన్నియో లక్షలకొలది సంవత్సరములకు బూర్వమున్న గుఱ్ఱమునకు నైదు డెక్కలున్న టులను కొంతకాలమునకు అనగా గొన్ని తరముల తరువాత అందొకటి యుపయోగములేమిచే క్రమముగా తగ్గిపోయి నాలుగు నిలిచినటులను, తరువాత క్రమక్రమముగా నవితగ్గి యొకటే యైనటులను, భూగర్భమునందు దొరికిన ఈ మృగముయొక్క యస్థిపంజరములచే నిశ్చయింప బడినది. ఇందుచే నిదిమొదట నైదుడెక్కలుగల మృగముల లోనిదియే యని చెప్పవచ్చును. ఈ లాగుననే యన్ని జంతువులను గుఱించి విచారింప సాగినయెడల కాని వాని బంధుత్వములు తేలగలవు.