జంతువులు క్రమక్రమముగా శరీరరచనయందును, విజ్ఞానమునందును హెచ్చుచు వచ్చును. ఈలాగు అత్యంత హీనమైన యేకకణమయ జంతువు క్రమక్రమముగా నభివృద్ధియై పూర్వముకంటె గొప్పజంతువుగా మాఱుచు మానవునిగా బరిణమించెను. కావున ఈ వాదమునకు బరిణామవాద మనియు, గ్రిందితరగతి జంతువులు పైతరగతిగా మారునని ప్రతిపాదించుటచే ఉత్క్రాంతి వాదమనియు బేరు. మొదటి పేరు మన యాంధ్రదేశమందును, రెండవపేరు మహారాష్ట్రదేశమందును, వాడుకలోనున్నవి. ఈ వాదమును మొట్టమొదట బ్రతిపాదించినది డార్విన్ అను ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. మానవుడు గూడ ఇతర జంతువుల తో బాటు ఉత్క్రాంతివలన బుట్టినవాడే గాని యిదివఱకు జను లనుకొనినటుల స్వతంత్రముగాను నకస్మాత్తుగాను బుట్టింపబడలేదని యీసిద్ధాంతము చెప్పు చున్నందున నిది యనేక సంవత్సరములవఱకును జనులకు గ్రాహ్యము కాలేదు. కాని దినదినము ఈ వాదమునకు ననుకూలమైన ప్రబల నిదర్శనములు కావచ్చు చున్నందున బ్రస్తుతము శాస్త్రజ్ఞులలో నూటికి దొంబది తొమ్మిదిమందికి గ్రాహ్యమైనది.
ఈ యుత్క్రాంతితత్వమును అనుసరించి చూడగా మిక్కిలి భేదముగాగనబడు సమస్తవృక్షములును, జంతువులును, జ్ఞాతులయి యున్నవని చదువరు లిదివఱకే గ్రహించియుందురు. జ్ఞాతులలో గొందఱు పది దినముల వారును, కొందఱు మూడుదినముల వారును, కొందఱు అశౌచములేని వారును ఉండుట సహజముగదా? చేపలు, పక్షులు, మానవులు మొదలగువారు మిక్కిలి దూరపు జ్ఞాతులుగాన వారి జ్ఞాతిత్వము త్వరగా దెలియదు. వారిలో నొకరి పోలిక లొకరి కున్నను సామాన్య జనులకు దెలియవు. సమీపజ్ఞాతుల బంధుత్వము కొంచ మాలోచించిన దెలియును. సింహము, పులి, చిఱుతపులి, పిల్లి, మొదలయినవన్నియు నొక్క కుటుంబములోనివి యే యని సాధారణముగా గానవచ్చును. కోతులు మానవులకు మిక్కిలి సమీపజ్ఞాతులని వారియాకార సామ్యత వలన దేట పడగలదు. ఇట్టి సమీప బంధుత్వము త్వరగా సామాన్య జనులకు గూడ తెలియును. కాని దూరపు బంధుత్వములగూడ మనకు దెలియని కొన్ని