lలన్నియు మొదట నొక్క రూపముగా నున్న యెడల వికారిణిమొదలు మనుష్యులవఱకు గల జంతుకోటిలో నింత వైధర్మ్య మెందుకు? వాని యంత్రరచన యందును, బాహ్యస్వరూపమునందును ఇంత భేద మెట్లుకలిగెను? అని కొందఱడుగవచ్చును. ఇందుకు, ఒక తలిదండ్రులకు బుట్టిన యన్న దమ్ములలో గొంత పోలిక యున్నను, భేదముండుట మనము చూచుచున్నాము. అన్నదమ్ములకంటె నన్న దమ్ముల కుమారులలో బోలిక తక్కువయై వైధర్మ్య మెక్కువ యగును. ఈప్రకారము తరములు హెచ్చిన కొలదిని పోలిక తగ్గి, వారి స్వరూపములు బొత్తిగా మాఱి, యొకటితో నొకటికి సంబంధము లేనివి యగును. ఇంతియగాక వీరందఱును భిన్నభిన్న దేశములకు బోయి, భిన్న భిన్న వృత్తుల నవలంబించి, భిన్న యాచార వ్యవహారములు గలవారగుదురేని, కొన్ని తరములలో వారు పూర్తిగా మారుదురు. అప్పుడు, వారందఱికి బూర్వమొకప్పు డొక మూలపురుషు డుండెననియు, ఆతనిసంతతివారే వీరందఱనియు జెప్పిన నెవ్వరును నమ్మజాలరు. ఈలాగుననే మూలపదార్థముయొక్క యేకవిధకణములలోనుండి పుట్టిన జీవులన్నియు నానావిధరూపముల దాల్చెను.
ఇట్లు జలచరములనియు, స్థలచరములనియు, పక్షులనియు, మృగములనియు భిన్న భిన్న జాతులుగా గానవచ్చెడి జంతువుల సమూహము దేనికది స్వతంత్రముగా బుట్టలేదు. ఇవి యన్నియు నొకటితో నొకటికి సంబంధము గలిగి యొక దానిలో నుండి మఱియొకటియో, లేక ప్రస్తుతమంతరించిన యనేక జాతులలోనుండి యోపుట్టినవని శాస్త్రజ్ఞులు గట్టిగా జెప్పగలరు. ఏక కణమయమైన వికారిణి మొదలు అత్యంతోన్నత జంతువగు మానవును వఱకును క్రిందినుండి పైవఱకు వచ్చెడి రాజభువన సోపానపరంపరవంటి మెట్లుగలవు. ఈ జంతువు లన్నియు గలసి యొక పెద్దగొలుసువంటివి. వేఱు వేఱు జంతువులు ఈగొలుసులోని కడియముల వంటివి. ఈ గొలుసుయొక్క యొక చివరను వికారిణివంటి యేక కణమయములును, మిక్కిలి తక్కువ విజ్ఞానమును చేతనవ్యాపారములును గలజంతువు లుండును. ఇంకొక చివర అసంఖ్యకణములతోను విచిత్ర యంత్రములతోను జేయబడినశరీరము గలిగినట్టియు, అసాధారణబుద్ధివైభవమును విజ్ఞానమును గలిగినట్టియు మానవుడు గలడు. ఈ యిద్దఱి నడుమనుండు