Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదాహరణములు. ఇంకను చిత్రమేమనగా కొన్ని కాయలు ఎంత యెండిపోయినను, తడితగిలినగాని పగులవు, అనగా వాని మొలకకు తగినసమయము గలిగినగాని కాయపగిలి గింజలు బయటబడవు.

పటములో జూపబడిన టపాకాయచెట్టుయొక్క కాయ నొకదానిని తీసికొని వచ్చి యెంతయినను ఎండబెట్టుము; ఆకాయ పగులదు. తరువాత నొక్క నీటిచుక్కచే గాని, ఉమ్మి నీటిచే గాని ఆ కాయను కొంచెము తడిచేయుము; తత్క్షణమే కాయపగిలి పలుప్రక్కలకు మిక్కిలి వడిగా విత్తనములు పరుగెత్తును. ఆహా! ఇంత యేల, కొన్ని వృక్షములు నోరులేని తమబిడ్డలకు రెక్కలనిచ్చి గాలిపోసుకొని మీబ్రతుకు మీరు బ్రతుకుడని విడిచివేయుచున్నవి. స్వజాతిని విచ్చలవిడి నభివృద్ధిచేయు నుద్దేశముతోడనే గదా జిల్లేడు చెట్లును, బూరుగు చెట్లును, రెల్లుదుబ్బులును, జమ్ము మొక్కలును తమ విత్తనములకు దూది రెక్కల నమర్చి పెట్టినవి.