నుండి పుట్టువిత్తనములు వీనికంటె తక్కువ బలముగలవియగును. ఈవిత్తనములు పనికిమాలినవను విషయము కాపువానికి తెలిసినతోడనే అట్టిమొక్కలగింజలను రాబోవు సంవత్సరమున తాను చల్లుకొనుట కేర్పరచుకొనిన విత్తనములలో కలిసిపోకుండ జాగ్రత్తగా తొలగించివేయును. ఇట్లు బహిష్కరింపబడి తుదకు వీని సంతతి కొంత కాలమునకు నశించిపోవును. ఇదియే ప్రకృతిసిద్ధమైన జగడములోనోడిపోవుట.
ఇట్టి కలహము లందు ఆరితీరుటకే యనేకచెట్లు తమసంతతి యగువిత్తనములకు తమకుసాధ్యమయినన్ని సుగుణములను చేర్చియుంచును. ఎట్లన నీటియందు పడుటచేగాని, మొలకెత్తుటకు తగినకాలములో తడినేలమీద బడుటచేగాని, మెత్తబడిపోకుండ వృక్షము లనేకములు తమగింజలపై కఠినమైన కవచములను జేర్చియుంచుట జూచియున్నారు. మరియు, ద్రాక్షపండు, నేరేడుపండు, రేగుపండు, శీతాఫలము మొదలగువాని గింజలు తమవృద్ధికి అనర్హమగు మానవునిశరీరములోని జీర్ణాశయములందలి అతితీవ్రమైన జీర్ణ రసములలో పడ్డప్పుడు సహితము వానిపై గప్పియుండు కవచముల కఠినత్వముచే జీర్ణము కావు. మరికొన్నివృక్షములు ఒకచోటుననుండి మరియొక చోటునకు పోవుచు వచ్చుచుండు మనుష్యునకును జంతువులకును తమగింజలను అంటుకొనునట్లు జేసి వానిని దేశ దేశములకు రవానాచేయును. ఉత్తరేణి, అంట్రింత, చిగిరింత మొదలగునవి