Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రును, నల్లనివెండ్రుకలవారును, అయిరి. ఇట్లు మొదట బూర్తిగ సాధర్మ్యము గల మానవులలో గ్రమక్రమముగ బాహ్యస్వరూపమందును, అంత:స్వరూపమునందును వైధర్మ్యముగలిగి వేఱువేఱు మానవజాతు లేర్పడెను. అటులనే జీవకణములన్నియు మొదట నొక్కటేయైనను క్రమక్రమముగా మారుచుబోయి, విధర్మములుగల అస్థి, చర్మ, స్నాయు మొదలయిన రూపములును దాల్చెను. ఇంతియకాదు ఈజిప్టు దేశములోని నల్లని సిద్దీజాతి స్త్రీని దీసికొనిపోయి లండనులోనుంచినను, నల్లనిశిశువునే కనును, తెల్లనిశిశువును గనదు. ఇది యానువంశిక ధర్మము (Law of Herity). అటులనే గర్భావస్థలో నున్నపుడు మనుష్యునిశరీరము మొదట సమానమగు కణమయమయి యుండును. అందుగొన్ని అనుకూలస్థితి ప్రాప్తమయిన తోడనే, వానియందు సదృశ్యరూపమున నుండు ఆనువంశికధర్మమును బట్టి అస్థిరూపమునే దాల్చును. కొన్ని స్నాయురూపమునే దాల్చును. మఱికొన్ని జ్ఞానతంతు రూపమునే దాల్చును.

పైన జెప్పిన యుదాహరణములన్నియు జంతువుల విషయమైనవి యగుటచే ఈజీవకణములు జంతుశరీరమునందుమాత్ర ముండుననియు, వృక్షములలో నుండవనియు జదువరులు భ్రమపడుదురేమో భ్రమపడవలదు. ఈకణములు వృక్షములందుగూడనుండును. వృక్షముయొక్కవేరు, ప్రకాండము (Stem), కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు మొదలయినవన్నియు ఈకణములకలిమిడి వలననే కలుగుచున్నవి.

ఈజీవకణములు సాధారణముగా నత్యంతసూక్ష్మముగా నుండును. సూక్ష్మదర్శినిసహాయమువలన గాని కానరావు. ఒకానొక జీవులలో నవి యంగుళములో ముప్పాతిక పొడవు పెరుగును.

ఈకణములనుగూర్చి యొక వింత గలదు. ఈ యొక్కొకకణ మొక్కొక యంత్రము అందు నొక్కొక్క దానికి నియమింపబడినపనులు రెండు తననుతాను పోషించుకొనుట; అందుమూలక ముగా శరీరమునంతను పోషించుట. దేశములోని ప్రతిమానవుడును తనను రక్షించుకొనుటయే గాక, దేశరక్షణార్థమైన కొంతపన్ను ఇయ్యవలయును. అటుల నే శరీరమునందలి కణములన్నియు