ఎండుకాయలు.
ఫలకవచము ఎండిపోవుకాయలలో సహితము అనేక భేదములు గలవు. ఎట్లన, ఉలవ, గిలిగిచ్చ, అవిసె, చిక్కుడు, కంది, తురాయి మొదలగుకాయలలో అర ఒక్కటే యుండును. బెండకాయ, ఆముదపుకాయ మొదలగువానిలో అనేక అర లుండును; క్రిందిపటములు చూడుము.
ఇందు కొన్ని కాయలు పూర్ణముగ ఎండినతరువాత ఫట్టున పగిలి గింజల వెడల జిమ్మును. వీనికి పగులుకాయలు (Dehiscent) అనిపేరు. వీనికి విదారణఫలములు అనియు పేరుగలదు. కాని మరికొన్ని కాయల కవచము ఎండినను కాయ పగులదు.ఉదా:- చింతకాయ వడ్లగింజ మొ. వీనికి గట్టికాయలనియు, అవిదారణ ఫలములనియు పేర్లు.
పగులుకాయలు.
పగులు కాయలలో మూడుభేదములు గలవు.
1. కాయయొక్క రెండుప్రక్కలయందును ఈనెలుండి రెండువైపులను పగి లెడుకాయలు ద్వివిదారణఫలములు. (Legume) ఉలవకాయ. కందికాయ, చిక్కుడుకాయ మొ.
ఈజాతియందు చెట్లు రాత్రులయందు నిద్రపోవునని కొందరి యభిప్రాయము. ప్రొద్దు గ్రుంకినతోడనే వీని ఆకులన్నియు ముడుచుకొనుటచే నివి నిద్రించున ట్లగపడుటను మీరును చూచి యుందురు.