పుట:Jeevasastra Samgrahamu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్య ఫలకవచము అని పేరు. కాయయొక్క జాతినిబట్టి ఈభాగమునందు కొద్దిగనో హెచ్చుగనో పీచు కూడఉండును. III.పటము 3 అంకెగలది గట్టిగనుండు టెంక. ఇది అంతర్ఫలకవచము.

2:- ఇది టెంకలోపలిభాగమున ఉల్లిపొరవలె పలుచగనుండు గోధుమరంగుగల పొర; ఇది గింజపై నుండు పొర; దీనికి బీజకవచము అనిపేరు. 1:- ఇది టెంకలోపలనుండు తెల్లనిజీడిపెచ్చుల రెంటిలో నొకటి; ఇది యొక బీజదళము. రెండు బీజదళములమధ్య నొక భాగమున కొక్కెమువలె వంకరతిరిగిన చిన్న మొలక యొకటుండును; ఇదియే మామిడిచెట్టుగా నేర్పడు పిండము.

కొన్ని గుంజుకాయలలో ఫలకవచముయొక్క లోపలి వైపుననుండు భాగము అనేక అరలుగా నేర్పడియుండును. నిమ్మ, పంపరపనస మొదలగు కాయలలోని యొక్కొక తొన యొక్కొక అర. కాయపై నుండెడు తొక్క బాహ్యఫలకచము. దీని లోపలిభాగమున దూదివలె మొత్తగనుండు భాగము మధ్యఫలకవచము. తొనలపై నుండు తొక్క అంతర్ఫలకవచము. రసముతో నిండియున్న ముత్యములనబడు కోమలమైన భాగములు అంతర్ఫలకవచమునుండి పుట్టినరోమములు. ఈరోమములోనుండు పలుచనిపదార్థము కణరసము. తొనయొక్క అంచు నొక దాని నంటియుండు గింజలను పరీక్షించిన వానియందలి బీజకవచములు, బీజదళములు, పిండము మొదలగువాని నిర్మాణము తెలియగలదు.

ఇట్లే బీరకాయలోగూడ ననేక అరలు గలవు. గుమ్మడికాయలో నొక్కటే అరగలదు.