ఫలకవచములోని భాగములు. గుంజు తినివేయగామిగులుభాగము గింజ. గుంజునకు లోపలివైపున పలుచనిపొర యొకటి గలదు. ఈపొర దానిలోపలి తట్టుననుండెడి కఠినమైన భాగమును కప్పియుండును.; ఇది బీజకవచము. దీనిలోపలనుండు కఠినమైనభాగము పిండతిత్తినుండి పుట్టినది; దీనికి బీజపోషకమని పేరు. కొబ్బరికాయలో మనము తినుచుండెడు భాగముకూడ ఈబీజపోషకమేయని క్రింద చదువగలరు. కాని ఈతకాయలో ఈభాగము గట్టిగనుండి రుచిహీనముగా నుండును. దీనిలోపల చిన్న మొటిమ గలదు; ఇది నిజమైన పిండము.
ఈతగింజ నొకదానిని తడినేలలో మొలవేసినయెడల దానినుండి క్రమముగ నొక చిన్నముక్కువలె వంగియుండు మొటిమ పుట్టి యామొటిమ దానిపై పొరలను పగుల్చుకొని భూమిలోనికి పోవును. ఇది ప్రథమమూలము; 90-వ పటములో క్రిందిభాగముననుండు వేరుయొక్క ప్రథమరూపమును జూడుము. దీనిపైభాగమున నుండి ఆదోకగనుండు మొలకయొకటి భూమినిపగుల్చుకొని బయటబడును. ఈమొలక ప్రథమశాఖాంకురము. దీనినుండి ఈత చెట్టు అంతయుపుట్టును; పటములో 2 చూడుము. ఈమొలక చుట్టుదళమైన పెచ్చువంటిభాగము అంటియుండును. ఈదళమైనభాగము బీజదళము. దీనికొకప్రక్కగా వ్రేలాడుచుండునది బీజపోషకము. ఇది గట్టిగనుండి నీటిని అంతగా చొరనియ్యని పదార్థమగుటచేత ఇప్పటికిని దీని ఆకారము ఈతగింజవలెనే యుండును.