స్థూలబీజాశయమునందలి యితరమార్పులు.
పిండతిత్తియందలి యుపజీవస్థానము చీలిచీలి యనేక భాగములగును. ఈభాగములచుట్టును కొంత మూలపదార్థము చేరి యనేకకణము లేర్పడును. కొన్ని గింజలయందు మావిగుండ అండాశయములనుండి కొంతయాహారము పిండతిత్తిలో జేరి యాపిండతిత్తిని పూర్ణముగ నిండించివేయును. ఈ పదార్థమునకు బీజపోషకము (Endosperm) అనిపేరు. ఆముదపుగింజలోని చమురు నిలిచెడుభాగమును, కొబ్బరికాయయందలి తినుట కుపయోగించు గుంజును దానిలోపలి నీరును, ఈతగింజలోని గట్టిబారిన భాగమును వాని బీజపోషకములయొక్క రూపములే. బీజపోషకములును బీజదళములవలెనే లేతమొక్కకు ఆహారముగా నుపయోగపడును. సామాన్యముగా స్థూలబీజాశయగర్భము పిండము పెరిగినకొలదిని హరించిపోవును. కొన్నిటిలో మాత్రము ఈభాగములోగూడ కొంత యాహారపదార్థము చేరియుండును. దీనికి బీజపరిపోషకము (Perisperm) అనిపేరు. మిరియపుగింజలో నిట్టిది గలదు. ఈవిషయములను తెలిసికొనునిమిత్తము బీజపోషకముగల గింజ నొకదానిని పరీక్షించి చూడవలయును. ఈపర్యాయము ఏకబీజదళ వృక్షములలో నేదైననొకదాని మొలకను పరీక్షించి చూతము.
ఏకబీజదళవృక్షముయొక్క మొలక.
ఈతకాయను మీరందరు చూచియుందురు. దాని పైభాగముననుండు పలుచని తొక్కయును దాని లోపలిగుంజును