Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షరా:- బాదము కాయలోపలనుండు బీజదళములు ఆకులవలె పలుచనివిగను, విశాలమైనవిగను ఉండును. ఇవి చుట్ట చుట్టుకొని గింజలోపల నణగియుండును. ఈ యాకులనె మనము బాదము పప్పు అని చెప్పుచు తినెదము. లేతబాదము కాయలోని పప్పును విడదీసిచూడుము.

ఈ గింజలను భూమిలో పాతిపెట్టినయెడల తగినతరుణమున నవి మొలక లెత్తును. అప్పుడు ప్రథమమూలము వేరుగా పరిణమించి గింజపై నుండు పొట్టు పొరలను అనగా బీజకవచములను పగుల్చుకొని భూమిలోనికి బోవును.

ప్రథమశాఖాంకురము భూమిపైకి పెరిగి ఆకుపచ్చని ఆకులను, శాఖలను గలది యగును. ఆ చిన్న మొక్కకు ఆకుపచ్చని యాకులు గలిగి యాహారమును సంపాదించుకొనుశక్తి గలుగువరకు దానికి బీజదళము లాహారమిచ్చి పోషించుచుండును. ఇట్లు చిక్కుడుగింజయందేగాక, ద్విబీజదళవృక్షములలో జేరిన ప్రతిగింజయందును పైనివివరింపబడిన ప్రథమమూలమును, ప్రథమశాఖాంకురమును, రెండు బీజదళములును గల పిండ ముండును. ఇట్లు రెండు బీజదళములుగల పిండములనుండి యుద్భవించెడు చెట్లే ద్విబీజదళ వృక్షములు. ప్రక్కననుండు వేపమొక్కయొక్క పటమును రెండవభాగముయొక్క ఆరంభముననుండు చింతమొక్కయొక్క పటమును చూడుము. ఇవి రెండును ద్విబీజదళవృక్షములే.