వృక్షము లేర్పడిన యెన్నియో యుగములకు జంతుసృష్టి ప్రారంభ మయ్యెనని విద్వాంసు లూహించియున్నారు. ఏలయన: శాఖాహారములేక జంతువులు బ్రతుకుట యెట్లు? కొందఱు మాకు శాఖాహారమక్కరలేదు, మేము మాంసాహారము తిని బ్రతుకుదుమని యందురేమో? కాని మన మానవుల కొక్కరికెగాక యన్ని జంతువులకును సేంద్రియాహారమవశ్యకము గనుక క్రిందిజంతువులు బ్రతక నిది మానవులకు మాత్రము మాంస మెచ్చటనుండి రాగలదు? మేకకు దినుటకు గడ్డియుండినగదా దానిమాంసము మానవునికి దొరకుట? ఇట్లు వృక్షములు నిరింద్రియ ద్రవ్యములను దీసికొని వానిని సేంద్రియములు చేయును. జంతువులు ఆ సేంద్రియ ద్రవ్యములనుతిని యందలి సేంద్రియత్వమును గైకొని తమవృద్ధికి నుపయోగపఱచుకొని, మరల వానిని నిరీంద్రియద్రవ్యములుగ మార్చును. ఇట్లు వృక్షములుకూర్చును, మనము వెచ్చింతుము.
జీవ కణములు.
(The Cell Doctrine)
జడద్రవ్యములన్నియు నెటుల అణువు (Molecules) లచే జేయబడినవో యటులనే జీవశరీరములన్నియు జీవకణము (Cells) లనబడు సూక్ష్మద్రవ్యములచే జేయబడినవి ఏవృక్షముయొక్క శరీరమును పరీక్షించిచూచినను, ఏజంతువుయొక్క శరీరమును శోధించినను, అవి కణమయమైయున్నటుల గానవచ్చును. అనేకమానవులు కూడి యొక సంఘముగాగాని దేశముగాగాని యెటుల నేర్పడునో యటుల నే యనేకకణములసమూహము దేహమనబడును. సాధారణముగా మనకు గానవచ్చెడి జీవులశరీరములన్నియు ననేకకణములతో జేయబడినను, సూక్ష్మదర్శనిచేగాని కానరాని యత్యంత సూక్ష్మజీవులు కొన్ని యేకకణమయమై యుండును. ఇట్టివి యనేకములు జంతువులలోను వృక్షములలోను గలవు. ఇవి జీవులలో మిక్కిలి తక్కువ తరగతివి. కడమ జీవులన్నియు అనేకకణములు గలిగియుండును. ఈ కణములయొక్క యాకారము భిన్నభిన్న జీవులలో భిన్నభిన్న విధముగ నుండును. కొన్ని అఱలవలె జతుష్కోణముగను, గొన్ని పొడవుగను, కొన్ని గుండ్రముగను వివిధా