2. మరియు స్త్రీపురుషబీజము లొక్కసారిగా వికసించిన పుష్పములలో సహితము, ఇట్టి యుపద్రవము గలుగకుండ, ఆ పుష్పములలోని స్త్రీ పత్రములు కింజల్కములకంటె మిక్కిలి పొడుగుగ నెదుగును. ఇందుచే పురుషబీజములు స్వకుటుంబములోని అనగా నేక పుష్పములోని అండాశయముపై బడనేరవు.
3. పురుషపుష్పములును స్త్రీ పుష్పములును ఒక్కటే గుత్తి యందుండు పుష్పములలో సహితము ఆ గుత్తియందలి మగపూవులయందుండు బీజములసంపర్కము దానియందలి ఆడపూవులకు గలుగకుండ కొన్ని యేర్పాటులు గలవు. 69-వ పటములోని ఆముదపుపూగుత్తినిచూడుము. అందలి ఆడపూవులు పై భాగముననున్నవి. మగపూవులు క్రిందిభాగముననున్నవి. మగ పూవులలోని పురుషబీజములు చెదరిపడినను అవి క్రింది వైపునకు పడునుగాని అదే గుత్తియందు పై భాగముననున్న ఆడపూవులపై సామాన్యముగా పడజాలవు. ఇందువలన దగ్గిర సంబంధములనువిడచి దూరపు సంబంధములలో వివాహమాడుట వృక్షములయుద్దేశమని తోచుచున్నది.
ప్రతిపుష్పమును దూరపుకుటుంబములోని పురుషబీజముల కాశించుచుండుటచేత నట్టి బీజములను తమకుసమకూర్చుటకు దూతలు కావలసియున్నారు. అట్టిదూతలు మూడుజాతులవారు గలరు. అందు మొదటివియు ముఖ్యమైనవియునగు దూతలు భృంగాదులు అనగా తుమ్మెదలును, తేనెటీగలును, చీమలును, రాత్రులయందు సంచరించుచుండు కొన్ని యితరములగు కీటకములును, రెండవదూత వాయువు మూడవదూత నీరు.