Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక పుష్పముయొక్క పురుష పత్రమునుండి యుద్భవించెడు సూక్ష్మ బీజములు ఆ పుష్పమునందలి స్త్రీ పత్రములోని స్థూలబీజములతో సంయోగము నొందవు. అట్లొకవేళ సంయోగమునొందినను, దానివలనగలుగు సంతానము మిక్కిలి బలహీనముగ నుండును. ఏలయన, ఆ బీజములు రెండు నొక పుష్పములో జన్మించిన వగుటచే అన్న చెల్లెండ్రవంటివి. మానవులలోసహిత మిట్టి వివాహ సంబంధములు గ్రాహ్యములు కావు. సంయోగమునకు రక్తసంబంధ మెంతదూరముగ నున్న నంత మంచిదని చెట్లుసహితము బోధించుచున్నవి. కావుననే మేనరికములు మొదలగు సమీప బాంధవ్యములు నిషేధింపదగినవి. ఇట్టి సంబంధములవలన కలుగు సంతానము బలహీనముగ నుండును. వంశపారంపర్యముగావచ్చు మతిభ్రష్టత, క్షయ, కుష్టు మొదలగు కొన్ని వ్యాధులు అట్టి వివాహసంబంధములచే తరతరములకు హెచ్చుచుండునని ఇప్పటి వైద్యులయభిప్రాయము.

ఇంతేకాక ఏకపుష్పమునందలి స్త్రీపురుషబీజములు సంయోగము నొందకుండ సృష్టియందలి కట్టుబాట్లు కొన్ని కానబడు చున్నవి.

1. ఒక్క పుష్పమునందలి స్త్రీపురుషబీజము లెన్నడును ఒక్కసారిగా వికసింపవు. సామాన్యముగా కొంజల్కములు ముందు వికసించును. అందలి సూక్ష్మబీజములు సంయోగమునకు సిద్ధముగ నున్నప్పుడు అండాశయము వికసింపదు. అనగా స్వకుటుంబములోని పురుషబీజము లన్నియు ఖర్చుపడువరకును స్త్రీ బీజములుయుక్త వయస్కములుగావు. కాన ఆ రెంటికిని సంయోగ మసాధ్యము.