పుట:Jeevasastra Samgrahamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్థములకు సచేతనత్వము ప్రాప్తమగుచున్నది. అనగా వృక్షములు ప్రాణములేని వానికి బ్రాణము పోయుచున్నవి. గాలి, నీరు, మన్ను, లవణములు అనుపదార్థములు అచేతనములు (నిరింద్రియములు: Inorganic). ఈపదార్థములను ఆహారముగాగైకొని వృక్షములు వీనిని సేంద్రియ ద్రవ్యములుగా అనగా గాయలు, పండ్లు, ధాన్యములుగా మార్చు చున్నవి. సర్వజీవములకును జీవాధారమైన మూలపదార్థము (Protoplasm) అను ద్రవ్యమును వృక్షములు మొట్టమొదట జడపదార్థములనుండి పుట్టించును. ఇటుల నిర్జీవద్రవ్యములకు సజీవత్వ మొసంగుసామర్థ్యము వృక్షములకుదప్ప మఱి యేజీవులకునులేదు. ఇంతియకాదు, వృక్షములు జంతువులజీవనముకు ముఖ్యాధారము. అదియెట్లన సృష్టిలోనివస్తువు లన్నియు సేంద్రియములు (Organic), నిరింద్రియములు (Inorganic) అని రెండుగా విభజింపబడును. సజీవపదార్థములును వానిచే సృష్టింపబడిన పదార్థములును సేంద్రియములనబడును. ఇతర పదార్థములు నిరింద్రియములు. బియ్యము, గోధుమలు, నూనె, నెయ్యి, శర్కర, ఎముక, మాంసము, దుంపలు, కఱ్ఱ, శంఖము మొదలయినవి సేంద్రియములు. బంగారము, ఇత్తడి, రాయి, గాలి, నీళ్లు, ఉప్పు మొదలయినవి నిరింద్రియములు. నిరింద్రియద్రవ్యములు వృక్షముల యాహారము. ఇట్టి నిరింద్రియద్రవ్యములలోనుండి సేంద్రియద్రవ్యములను వృక్షములుపుట్టించునని పైనజెప్పియున్నాము. జంతువులయాహారము ముఖ్యముగా సేంద్రియద్రవ్యములుగలది. అందు నిరింద్రియద్రవ్యములు మిక్కిలి తక్కువగానుండును. మనుష్యప్రాణియొక్క భక్ష్యభూతపదార్థములను బరీక్షించినయెడల ఉప్పు, నీరు, గాలి యీమూడు పదార్థములే యందు నిరింద్రియములు. మానవుడుభక్షించు బియ్యము, పప్పు, ఫలములు, పాలు, వెన్న మొదలయిన వన్నియు వృక్షములచేగాని జంతువులచే గాని చేయబడిన సేంద్రియద్రవ్యములే. కేవల నిరింద్రియద్రవ్యములు తిని మానవుడు బ్రతుకలేడు. కావున మన జీవ నాధారమునకు వృక్షము లత్యావశ్యకములు. నేడు సృష్టిలోని జంతువులన్నియు నశించినను వృక్షములుకొంతవఱకు బ్రతికియుండగలవు. కాని వృక్షములు నశించె నేని జంతువులన్నియు నొక్క పెట్టున విలయముజెందగలవు. ఇందుచే బృథ్విమీద