రూపభేదము లుండునో చూడవచ్చును. మొట్టమొదట ఆకర్షణ పత్రములలో కొన్ని కొంచెముసన్నమగును. క్రమముగా వీని సన్నదనము పై వరుసల కెక్కిన కొలదిని హెచ్చుచుండును. ఇవి యన్నియు ఆకర్షణ పత్రములవలె ఎర్రగనే యుండును. తరువాత నీ సన్ననిపత్రములు కొంచెము దళసరిగల వగును. దీని పై యంతస్తునందలి పత్రముల కొనయందు లోపలితట్టున రెండు నిలువుగీట్లు గన్పట్టును. ఈగీటులే క్రమముగా సూక్ష్మబీజాశయము లనబడు వృత్తములుగా పరిణమించును. అనగా నాపత్రములు పురుషాంగముల ధరించును. వీని పై యంతస్తునం దుండు రేకులు క్రమముగా ఆకర్షణపత్రముల అందమును పోగొట్టుకొని పురుషాంగముల ధరించుటయే ముఖ్య వ్యాపారముగ నేర్పరచుకొని హెచ్చుమార్పుల జెందును. ఇట్టి స్థితియందు ఈ పురుషపత్రములు ఆకర్షణ పత్రములనుండి పరిణమించినవని చెప్పిన సరియో కాదో యనుసందేహము గలిగించునంతటి మార్పు గలుగుచున్నది.
కొన్ని పుష్పములయం దీ పురుషపత్రములన్నియు తమ మొదటిభాగములందుగాని, చివరభాగములందుగాని యొక దాని నొకటి అంటుకొనిపోయి యుండును. గంగరావిపూవునందు వీని మొదళ్లన్నియు నొక దిమ్మగా నేర్పడి యాదిమ్మమీద పురుషాంగములన్నియు క్రిక్కిరిసి యంటియుండును. మందారపూవునందు పోగులన్నియుజేరి యొక గొట్టముగా నేర్పడి, దాని చివరభాగమున పురుషాంగములు మాత్రము వేరువేరుగా నంటి యుండును.