పుట:Jeevasastra Samgrahamu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెను, గాని యా కప్పబడిన పుష్పములనుండి యవి మూయబడి యున్నంతకాలము కాయలు పుట్టలేదు. ఇంతేకాక వానిపై గప్పిన వస్త్రము తీసివేయబడినతోడనే తుమ్మెదలు వానిపై జుమ్మని వ్రాలుచుండుటయు నవి పిమ్మట గర్భవతులగుటయు జూడగలిగెను. దీనినిబట్టి చూడ పుష్పములు తమంతట తాము గర్భవతులు కాజాలవనియు, అట్లు గర్భవతులగుటకు భృంగాదుల సహాయ మేటికో కావలసియున్నదనియు. అట్టి సహాయకారుల నాకర్షించుటయే యీ రమ్యమైనపుష్పముల యుద్దేశమనియు మన మూహింపనగు. ఇట్లాకర్షింపబడు తుమ్మెదలు మొదలగునవి పుష్పముల కెట్టి యుపయోగకారులో ముందు జూడగలము.

3. కింజల్కములు లేక పురుషపత్రములు.

పైని జెప్పబడిన రక్షక ఆకర్షణపత్రములు రెండునుగూడ సంతానవృద్ధికి సహాయభూతము లేగాని యంతగా ముఖ్యావయవములు గావు. ఇవి లేకయే కొన్నివృక్షములు సంతానవృద్ధి నొందును. కింజల్కములును, అండాశయములును ఇందునకు ముఖ్యాంగములు. ఇవి సామాన్యముగా ఆకర్షణపత్రముల పై భాగమున నుండును. ఇందు కింజల్కములు పురుషభాగము. అండాశయము స్త్రీ భాగము.

కింజల్కములు సామాన్యముగా తామరపువ్వు ఉమ్మెత్తపువ్వులందువలె పొడుగుగను, సన్నముగను ఉండును. వీరికి కేసరములనియుపేరు. ఇందు రెండుభాగములుగలవు. సన్ననిదారమువంటి మొదటిభాగమునకు పోగు (Filament) అని పేరు (70, 72, 73-వ పటములు చూడుము). వానిచివర నంటియుండు చిన్న జీలకర్రపాయవంటి