నాలుగవ ప్రకరణము.
వేరు (The Root).
ఆకులు సూర్యకాంతి ఏవైపుననుండి వచ్చు చుండునో ఆవైపునకే పెరుగుస్వభావము గలవి. వేళ్లు అటుగాక వెలుతురునకు ప్రతిముఖముగా అనగా సామాన్యముగా భూమిలోనికి బోవుచుండును. కాని కొన్ని వృక్షములయందు అబ్బురపువేరులు (Adventitious Roots) ఆకులనుండియు, శాలనుండియు పుట్టి గాలిలో వ్రేలాడు చుండును. ఉదా:- మర్రిఊడలు. మరికొన్ని అబ్బురపువేరులు భూమిలోనికిగాక, గాలిలోనికి గాక యితర వృక్షముల కొమ్మలలోనికి జొరుచుకొనిపోవుచు ఆవృక్షములు సంపాదించుకొనిన ఆహారములో పాలు గూడుచుండును. ఇట్టి వృక్షములకు పరాన్నభుక్కులు (Parasites) అని పేరు.
ఆకారము.
ద్విబీజదళవృక్షములలో సామాన్యముగా నొక తల్లివేరు గలదు (65-వ పటము చూడుము). ఆతల్లివేరు మిక్కిలిపొడుగుగ భూమిలోనికి బోవును. దానినుండి అక్కడక్కడ పిల్లవేరులు పుట్టుచుండును. బోదెకు దగ్గిరనున్న పిల్లవేరులు ముదిరినవి. బోదెకుదూరమున అనగా లోతుననున్న పిల్లవేరులు లేతవి.