లుండును. ఈ హరితకముల మూలముననే ఈ యాకులు కిట్టి ఆకుపచ్చనిరంగు గలిగినది. ఈ హరితకములలోని రంగు పసిమిరంగుగా మారుటచే పండుటాకుల కట్టి రంగు గలుగుచున్నది.
5. పైనిజెప్పిన గోడకును, గుల్లకును మధ్య అతుకులో నక్కడక్కడ నొక్కొక వాహికాపుంజము గానవచ్చును (అది పటములో జూపబడలేదు). అందు దారువు పైవైపునకును, త్వక్కుక్రిందివైపునకును ఉండును. కొంచెము పెద్దదైన వాహికాపుంజములచుట్టు నొడ్డాణమును, దానిచుట్టు అంతశ్చర్మకణములవరుసయు నుండును. ఈ అంతశ్చర్మకణములలో సామాన్యముగా పిండి అణువులు నిలువ జేయబడి యుండును.
6. ఈ వాహికాపుంజములనుండి మృదుకణములగుండ నటునిటు బహిశ్చర్మమువరకు దృఢకణము లక్కడక్కడ త్రాళ్లవలె వ్యాపించియుండును. వాహికాపుంజములును వానితో జేరియుండు నీ దృఢకణములును ఆకునకు నిలబడుటకుశక్తి గలుగ జేయునట్టి వగుటచే నవియే వాని అస్థిపంజరమని యూహింపనగును.
షరా:_ (1) పైని జెప్పబడిన వర్ణనయంతయు సామాన్యముగా మనము జూచెడు ఆకుల కన్నిటికి వర్తించును, గాని గగనమువైపునకు నెక్కియుండు కొన్ని ఆకులయొక్క రెండువైపులు నొక్కరీతిగనే యుండును. వానియందు రెండువైపులను నోరు లుండును. రెండువైపులను మృదుకణముల గోడ లుండును.
(2) నీటిమీద తేలుచుండు తామరాకులవంటి యాకులలో నోరులన్నియు పైవైపుననే యుండును.