మువలె గుండ్రముగనే యుండును. సూదులవలెనుండు సరుగుడు చెట్టు (Casuarina) యొక్క ఆకులు చూడుము.
పత్రవిశేషములు.
తమ్ము నాశ్రయించియుండు సందర్భములకు తగినట్లుగా తమ తమ వ్యాపారముల నెరవేర్చునిమిత్తము ఆకులు వివిధరూపముల నొందును. అందు ముఖ్యభేదములు:
1. బీజదళములు:- ఇవి బీజమునుండి మొక్క మొలచునప్పుడు మొట్ట మొదట పుట్టు దళమైన ఆకులు. ఇవి నానియుబ్బిన బీజములోని పప్పుబద్దలే. వీనియందు సామాన్యముగా హరితకములు లేకపోవుటచేత నివి తెల్లగ నుండును. గింజయందలి పిండిపదార్థము (Starch) బీజశర్కరికము (Diastase) అను రసముయొక్క శక్తిచే చక్కెరగా మారుననియు, ఇదియే బాల్యమునం దా మొక్కకు ఆహారముగా నుండుననియు నిదివరలో జెప్పి యుంటిమి. ఏకబీజదళవృక్షములలో నీదళములు ఒంటిగను, ద్విబీజదళవృక్షములలో జంటగను ఉండును. దీనినిబట్టియే ఆయా వృక్షజాతుల కట్టి నామములు గలిగె.
2. అల్పదళములు:- ఇవి పలువిధములైన రంగులుగల చిన్నచిన్న పలుచని ఆకులు. ఇవి భూమిలో వ్యాపించుకొమ్మల యందును, కొన్నిటియందు శాఖాంకురముయొక్కయు, పూగుత్తులయొక్కయు మొదటిభాగమునందును ఉండును. వీనివ్యాపారము సామాన్యముగా సంరక్షణము. భూమిలోనుండు నీరుల్లి మొదలగు దుంపలయందలి పై రేకు లీ యాకులే. ఇందు కొన్ని