4. ఈ అంతశ్చర్మమునకు లోపలితట్టున అండాకారముగల వాహికాపుంజములు చుట్టును తోరణము గ్రుచ్చినట్లుగా నున్నవి. ఒక వాహికాపుంజములో మూడుభాగములు గలవు.
(1) వెలుపలిభాగమునకు త్వక్కు (Phloem or Bast) అనిపేరు. త్వక్కునందు త్వగ్వాహిక లుండును. ఈ వాహికలయం దక్కడక్కడ జల్లెడకండ్లవంటిరంధ్రములు గల అడ్డుపొర లుండుటచే దానికి జల్లెడకాలువలు (Sieve tubes) అనియు పేరు. ఈ వాహికల మధ్యనుండు సందులలో మృదుకణము లిమిడియున్నవి. ఒకానొకప్పుడు త్వగ్వాహికల వెలుపలితట్టున నారవలె జిగిగల పొడుగైన కణములవరుస లుండును. ఇందలికణముల మూలపదార్థము చాలవరకు హరించిపోయి యీకణములు నారపోగులవలె నుండును. ఈ కణములసంహతికి దృఢత్వక్కు (Hard bast) అని పేరు.
(2) లోపలిభాగమునకు దారువు (Wood or Xylum) అని పేరు. దీనియందు సామాన్యముగా మిక్కిలి పొడుగుగనుండు దృఢకణములు (Schlerenchyma) అధికముగ నుండుటచేత నిది ఎక్కువపీచుగ నుండు స్వభావముగలది. ఇందుండు కాలువలు అడ్డుగట్లు లేకుండ ధారాళముగ నుండును. వీనికి దారువాహికలు (Wood vessels) అని పేరు. వీని గోడలయొక్క లోపలితట్టున మిట్టపల్లము లుండి, వాని యానవాళ్లు కొన్నిటియందు కడియములవలెను (Annular) నిచ్చెనలవలెను (Scalariform)