యందలికణములు వ్యాపించియుండును. ఈ సందులకు కిరణములు (Medullary rays) అని పేరు.
ఈపటమును ఇంకను శ్రద్ధగ పరీక్షించిన దాని నిర్మాణము చక్కగ తెలియగలదు. అందు వెలుపలివైపుననుండి వర్ణించు కొనిరాగా:-
1. మొదట కొంచెము బల్లపరుపుగనుండు కణములవరుస యొకటి గలదు. ఇవి ఇటికవలె నొక దానిప్రక్క నొకటి చేర్చబడి చెట్టునకు వెలుపలిగోడ యగును. దీనికి బహిశ్చర్మము (Epidermis) అని పేరు. ఈకణములలో కొన్నిటికి పొట్లతీగెలు మొదలగు వానియందు మనము చూచునట్టి నూగువంటిరోమములు (Hairs-రో) ఉండును.
2. పై పటములో బహిశ్చర్మకణములకు లోపలితట్టున పట్ట (Cortex) యను ఏడు లేక ఎనిమిది కణములవరుసలు గలవు. ఇందు బహుభుజములుగల కణములు పేర్చబడియుండును. ఇందు వెలుపలివైపున నుండు రెండు లేక మూడువరుసలకు దళమైన కణకవచములు గలవు. ఈ వెలుపలివరుసలనుండియే బెండు అనగా కార్కు (Cork) వంటిపదార్థమును, దానినుండి బెరడును ఏర్పడును.
3. ఈ పట్టయొక్క లోపలితట్టున నొక కణములవరుస గలదు. ఇందు పిండి (Starch) అణువులు పెక్కు లుండును. ఈ వరుసకు అంతశ్చర్మము (Endodermis) అని పేరు.