పదార్థము నిలువజేయబడియుండుట చేత నివి యుబ్బి యట్లు దళసరెక్కియుండును.
6. ముండ్లు (Thorns):- ఒక్కొకచో నీకొమ్మలు వృక్షమును శత్రువులనుండి సంరక్షించుటకు భటులుగ నేర్పడును. తుమ్మముళ్లు కొమ్మలయొక్క రూపభేదములే. ఇవియును ఆకు పంగనుండియే పుట్టుట కొంచెము పరీక్షించిన తెలియగలదు. వీని శాఖాంతములు పెరుగుట మాని మొనకూరియుండును. బ్రహ్మజెముడు చెట్టునందు అట్టలవలె నుండు ముండ్లుగల భాగములు (Cladodes) కొమ్మల రూపాంతరములే. దానియాకు లీ కొమ్మల క్రిందిభాగముగ చిన్న చిన్నవిగ నుండును. ఈ కొమ్మల నుండి పువ్వులును, కాయలును, పుట్టుచుండుట జూడవచ్చును. ఈకొమ్మ లిట్లే అనేకరూపభేదములు చెంది యనేకవిధముల వృక్షములకు సహాయ మొనర్చు చుండుట చదువరులకు విదితము కాగలదు.
7. నేలగొమ్మలు (Rhizomes):- భూమిలోపలనే ప్రాకునట్టి స్వభావముగల గరికె మొదలగువానిలో మనము సామాన్యముగా గరికెవేళ్లని చెప్పు తియ్యగనుండు కాడలవంటి భాగములను నేలగొమ్మలని చెప్పవలయును. ఇవి వేళ్లు కావు. ఈ కొమ్మల స్కంధశిరములనుండి సన్ననివేళ్లు అక్కడక్కడ గుంపులుగుంపులుగ వెడలుచుండుట జూడవచ్చును. ఈకనుపులనుండి పుట్టు నుపశాఖలు పైకి పెరిగి పచ్చగడ్డి యగును.