పుట:Jeevasastra Samgrahamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముయొక్క విషయములు. ఈశాస్త్రమును అభ్యసించువారు ప్రప్రథమమున సచేతనము (జీవము) లకును అచేతనములకునుగల భేదమును చక్కగ గనుగొనవలయును. అచేతనములందు లేని యీక్రింది ధర్మములు సచేతనములందు గలవు:-

1. శరీరనిర్మాణము (అవయవరచన) - సాధారణముగా శరీరమును ఒక యంత్రముతో బోల్చెదరు. ఈశాస్త్రమునందు శరీరమనగా కేవలము మానవశరీరము కాదు. సూక్ష్మదర్శని (Microscope) సహాయముచేగాని కానరాని యత్యంత సూక్ష్మబిందువువలెనుండి వికారిణి (Amoeba) అను జీవిమొదలుకొని సమస్తజీవులకు రాజగు మనుష్యునివఱకు గల అసంఖ్య జీవులయొక్క శరీరమునకును ఈశాస్త్రమునందు శరీరమని పేరు. వృక్షములును జీవులే అయినందువలన వాని అవయవనిర్మాణమునకు శరీరమనియే పేరు. ఇట్టి ప్రతిశరీరము యంత్రమువంటిది. గడియారము, ప్రత్తిమర, బియ్యపుమర, కుట్రపువానియొద్ది బట్టలుకుట్టెడి మిషన్ మొదలయిన యంత్రములను తెలుగు చదువరులు చూచియుందురు. ఈ యంత్రములయం దేముండును? అనేక చిన్న చక్రములును పెద్దచక్రములును, ఇరుసులును మఱి కొన్ని అవయవములు కలిగి, యిం దొక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనార్థము నిర్మింపబడి యొక్కొక్క పనిజేయుచున్నటుల గానవచ్చుచున్నది. ఆలాగునే ప్రతి శరీరమునందును పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మస్తిష్కము, హృదయము, జ్ఞానతంతువులు, ఉదరము, మజ్జా, మొదలయిన అవయవములలో నన్నియో, కొన్నియో గలిగియుండి,వాని వాని వ్యాపారముల జేయుచుండును. యంత్రముయొక్క రచన యెంత సులభముగా నుండునో దానియొక్క వ్యాపారమంత తక్కువగ నుండును. యంత్రముయొక్క రచన యెంత యెక్కువ చిక్కుగ నుండునో దానివ్యాపారములు గూడ నంతయధికముగా నుండును. అనగా నది యధికముగా బనిచేయును. ఇందుకు గడియారమును ఉదాహరణముగా గైకొందము. కేవలము గంటలు, నిమిషములు తెలుపు గడియారములో గొలది చక్రములే యుండును. క్షణములజూపు దానిలో నొంకొక చక్ర మధికముగానుండును. అంతకంటె