త్రుంచివేసినయెడల నా కొమ్మకొనయందు పెంపు ఆగిపోవును. అంతట నీ పొట్టిమొటిమలన్నియు తమ యవసరము వచ్చినదని గ్రహించి పెరుగుటకు ప్రారంభించును. కావుననే మనము త్రుంచి వేసినట్టి ఒక్క తల్లికొమ్మకుబదులుగా అనేకములగు పిల్లకొమ్మలు గుబురుగా బయలువెడలును. తల్లికొమ్మ పెరుగుచున్నంతకాలము ఈ పై జెప్పిన మొటిమలలో ననేకములు పెంపునొందవు. ఈ కారణముచేతనే మిక్కిలి పొడుగుగ పెరిగిపోవు వరిచేలు మొదలగునవి పశువులచేత నొక్కతరి మేసినచో, అణగియున్న శాఖాంకురములన్నియు పెంపునొంది దుబ్బు కట్టుకొనివచ్చును. చెరుకుముక్కల కనుపులందలి యిట్టి గొడ్డుమొటిమలే భూమిలో నాటబడినప్పుడు మొక్కలుగా పుట్టుచున్నవి.
శాఖయొక్క, ఉపయోగములు.
జంతువులయొక్క ముక్కు నోరు మొదలగు వేర్వేరు అవయవములు వేర్వేరుపనులకు ఏర్పడియున్నట్టులే వృక్షములయొక్కయు ఆకు, కొమ్మ, వేరు మొదలగుభాగములు వేర్వేరుపనులకు నియమింపబడి యుండును. శాఖయొక్క ముఖ్యవ్యాపారము లీ క్రింద సంగ్రహముగ వ్రాయబడుచున్నవి.
1. ఆకులను భరించుట:- ఇవి వేలకొలది ఆకులను భరించును. ఈ యాకులు కొమ్మలకు గావలసిన యాహార పదార్థములను గాలిలోనుండి కైకొనును. మనవలె వృక్షములు నడచిపోయి యాహారమును సంపాదించుకొననేరవుగదా? ఇవి యున్న చోటనె