పుట:Jeevasastra Samgrahamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాఖాంకురములును ఒకసారి కుడిప్రక్కను, మరియొకసారి యెడమప్రక్కను క్రమముగా పుట్టుచుండును. ఈజాతికొమ్మ నొకదాని నెత్తి, వానియాకులను ద్రుంచివేసి ఆ యాకుల మచ్చల నన్నిటిని జేర్చునట్లుగా నొక గీటు గీసిన ఆ గీటు పాము మెలికలవలె కొమ్మచుట్టును చుట్టి చుట్టివచ్చును. కాన నిట్టి యాకుల ప్రసారమునకు సర్పప్రసారమని పేరు. ఈ ఆకుపంగలలో పుట్టిన శాఖలప్రసారమును ఇట్లే మెలికలుతిరిగినదిగా నుండును. దీనికిని సర్పప్రసారమనియే పేరు. ఈ శాఖలన్నియు పుట్టుకలో క్రమప్రకారము కుడియెడమలను ఒకటివిడిచి ఒకటి పుట్టినప్పటికిని అందు కొన్ని పెరుగకపోవుటచేతను, కొన్ని బాల్యమునందే పరులచే నాశముచేయబడుటచేతను, కొన్నికొమ్మలు అనేకవిధముల వంకరల నొందుటచేతను, చెట్టుయొక్క పెద్దకొమ్మలలో పై జెప్పిన నిర్ణయమైన సర్పప్రసారము కానరాదు. లేతకొమ్మలలో జూచిన నిది చక్కగ తెలియుచుండును.

గొడ్డు మొటిమలు.

ఈ శాఖాంకురములలో కొన్నిమాత్రము వృద్ధిబొంది, మరికొన్ని చిన్నచిన్న మొటిమలుగా నున్నప్పుడే గొడ్డువై అణగి యుండునని చెప్పియుంటిమి. లేతకొమ్మలందు కొన్ని ఆకుపంగలలో నీ గొడ్డు మొటిమలను చక్కగ జూడవచ్చును. ఇవియును గత్యంతరము లేనప్పుడు అనగా తప్పనితరి వచ్చినప్పుడు తిరిగి పెంపునొందును. ఎట్లన, ఒకకొమ్మయొక్క కొనమొగ్గను మనము