వెడలుచున్నవనిగ్రహించవలెను. ఈ కనుపులనుండి పొల్లకొమ్మలు కిరణములవలె ఇరుప్రక్కలకు వ్యాపించుచుండగా, తల్లికొమ్మ యథాప్రకారము నిలువున బోవుచుండును. ఇట్లు ఒక్క స్కంధశిరము నుండియే అనేక వైపులకు ప్రసరించుశాఖలయొక్కయు, ఆకులయొక్కయు వ్యాప్తికి కిరణప్రసార మని పేరు. ఒక్క మధ్యబింబమునుండి నలువైపులకు వ్యాపించు వెలుతురు కిరణములప్రసారమును బోలియుండుటచే నీ శాఖలవ్యాప్తి కిట్టినామము గలిగెను. కొన్ని కొమ్మలలో నలువైపులకు నాలుగుకొమ్మలు గానవచ్చును. బూరుగు చెట్టునందు ఒక్కొక స్కంధశిరమునుండి మూడుకొమ్మలుపుట్టి మూడువైపులకు వ్యాపించును. తులసి తొగరులందొక్కొక స్కంధశిరమున రెండేసికొమ్మలు పుట్టి యిరుప్రక్కలకు వ్యాపించును. ఒకానొకప్పుడు శాఖాంకురములలో కొన్ని పుట్టినతోడనే గొడ్డుపోయి (Become aborted) పెంపు మాసియుండుట చేత నీ శాఖలలో కొన్ని లోపించియుండును.
సర్పప్రసారము.
2. సర్పప్రసారము:- ద్విబీజదళవృక్షములలో ననేకము లీతరగతిలోనివే. రావి, మామిడి, చిక్కుడు మొదలగువాని లేతకొమ్మను చూడుము (46-వ పటము చూడుము). తల్లికొమ్మయందు ఒక్కొక కనుపునకు ఒక్కొక యాకును, ఆయాకుపంగయందు గాని, లేక దాని యెదుటిభాగమునగాని ఒక్కొక పిల్ల కొమ్మయొక్క అంకురమునుమాత్రము పుట్టుచుండును. ఈ ఆకులును