గావు. ఆ చిన్న మొక్కకు ఆకుపచ్చని ఆకు లేర్పడి ఆహారమును సంపాదించిపెట్టువరకు కొన్ని దినములు పట్టును. ఆ కాలమునందు ఆ మొక్కకు కావలసిన ఆహారము శర్కరరూపమున ఈదళములలోనుండి యమర్చబడును. ఈ చక్కెర యీగింజలయందుండు పిండి (Starch) నుండి తయారుచేయబడినది. వీనియందలి పిండి బీజశర్కరికము (Diastase) అనునొక రసముయొక్కశక్తిచే నిట్లు చక్కెరగామారునని మూడవప్రకరణములో జెప్పియున్నాము. పైని జెప్పినట్లు రెండు బీజదళములుగలవృక్షములకు ద్విబీజదళములు (Dicotyledons) అనిపేరు.
ఏకబీజదళవృక్షము.
తాటిచెట్టు, అరటిచెట్టు, జొన్న, వరి మొదలగు కొన్నిధాన్యాదులు, గడ్డిమొక్కలు మొదలగునవియు ఏకబీజదళవృక్షములలో (Monocotyledons) జేరినవి. ఈజాతియందలి మొక్కలు గింజలనుండి అంకురించునప్పు డా పిల్ల మొక్కల కాహారమునిచ్చు బీజదళము ఒక్కటియే యుండును. తాటిమొక్క కాహారము నిచ్చుటకై ఏర్పడిన బీజదళములగు తేగలు తియ్యగనుండుట దానియందలి చక్కెరగుణమే. ఈ చక్కెరయే తాటిమొక్కకు బాల్యమునందు కొన్నిదినములవరకు ఆహారముగా నేర్పడుచున్నది. ఇట్లే వడ్లగింజలలోని బియ్యముగింజ వరిమొక్క యొక్క ఆహారమునిమిత్తము నిలువచేయబడిన యొక బీజదళము. ఇందుగల వరిపిండి, మొక్క యంకురించునప్పుడు చక్కెరగా మారును.