Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎట్లు ఏర్పడెనో చూచియున్నాము. ఇట్లే ప్రాణులయందలి పోలికలనుబట్టి జీవశాస్త్రజ్ఞులు సృష్టియందలి సమస్తప్రాణులను తరగతులుగ విభజించి వానికి గల సంబంధబాంధవ్యముల గ్రహించుటకు తగినయేర్పాటులు చేసియున్నారు. అందు జంతువులలోని ముఖ్యభాగముల నిం దుదాహరించియున్నాము. ఇందు మూలవిభాగములు అయిదు:

జంతువర్గమునందలి మూలవిభాగములు.

1. వంశాస్థిమంతములు (Vertebrata), వెన్నెముక గలవి. మనుష్యులు, మృగములు, పక్షులు, పాములు, చేపలు మొదలగునవి.

2. సంధిమంతములు (Articulata), శరీరమునందు కణుపులు గల జంతువులు, తేళ్లు, పీతలు, సాలెపురుగులు మొదలగునవి.

3. మృదుశరీరవంతములు (Mollusca), మెత్తనిశరీరములు గలవి. నత్తలు, జలగలు, ఎర్రలు మొదలగునవి.

4. జీర్ణాశయబిలవంతములు (Coelenterata), శరీరములోపల పొడుగునను జీర్ణాశయమను బిలము గలవి.

5. స్వతంత్రకణవంతములు (Protozoa), ఏకకణప్రాణులును, ఒకదానితో మరియొకటి సంబంధము లేకుండ జీవింప శక్తిగల కొద్ది కణముల సమూహములును, ఈ తరగతిలోజేరును.