Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృక్షములకును జంతువులకును ఆదిజీవి యొక్కటియే.

వృక్షజాతిలోని నాచుమొక్కయొక్క పిండమునకును జంతుజాతిలోని హైడ్రాయొక్క పిండమునకును మల్బెరీదశకు వచ్చువరకు నేవిధమైన భేదమును లేదు. రెండును ఏకకణపిండమునుండి పరిణమించినవియే. ఈ విషయమును జక్కగ పరిశీలించినయెడల నాచు మొక్కకును హైడ్రాకును ఆదిజీవి యొక్కటియే అని తెలియగలదు. అనగా నీ రెండును ఒక్క సంతతిలోనివే. ఆ యాదిజీవియొక్క బిడ్డలు అన్నియు నొకదాని నొకటి బోలియుండి యనేక విషయములయందు తమతల్లిని బోలియుండును. ఈ బిడ్డలన్నియు మొట్టమొదట నేకకణపిండములుగా నుండి యేక మార్గముననే నడచుచు కణవృద్ధి కణవిభాగము మొదలగు మార్పుల జెందుచు కొంతవరకు అనగా పైని జెప్పిన మల్బెరీదశను జెందువరకు ఆ మార్గమును విడువక పోవుచు, పిమ్మట రెండుజాతులును విడివడి వేర్వేరుమార్గములబోయి తమతమ యిచ్చవచ్చినట్లుగా వృద్ధిబొందుచు ఒకజాతివి వృక్షములుగను, రెండవజాతివి జంతువులుగను పరిణమించెనని యూహింపనగు.

పోలికలు; వ్యత్యాసములు.

ఈ సంగతి మన మనుదినము లోకములో జూచు దేష్టాంతమువలన స్పష్టమగును. మనవారలు చంటిబిడ్డలను జూడగానే పోలిక లెంచుచుందురు. సామాన్యముగా ఆ బిడ్డలు కొలదిగనో గొప్పగనో తల్లిదండ్రులను బోలియుందురు. అందు కొందరు ప్రత్యేకముగ తల్లిని, కొందరు ప్రత్యేకముగ తండ్రిని బోలియుందురు.