అనియు నామములు. అవలోకనమునకు నిరీక్షణ మనియు ప్రయోగమునకు శోధన, పరిశోధన అనియు నామాంతరములు.
1. అవలోకనము.
సృష్టిలోని పదార్థములను, వాని వ్యాపారములను గుణధర్మములను, కార్యకారణసంబంధమును, సృష్టి నేమములను, కనుగొనునిమిత్తమై సృష్టి చమత్కారములను శ్రద్ధతో జూచుట అవలోకన మనబడును. గ్రహణము లెప్పుడువచ్చునో లెక్క వేయువిధము జ్యోతిష్కు లెట్లు కనుగొనిరి? అవలోకనమువలననే. గ్రహణము లెప్పుడుపట్టునో కనిపెట్టుచుగొన్ని దినములవఱకు నవలోకనముచేసి సూర్యగ్రహణ మమావాస్యనాడును, చంద్రగ్రహణము పౌర్ణిమనాడును తప్ప యితర దినములలో రావని నిశ్చయించుకొనిరి. కొన్ని సంవత్సరములవఱకు గ్రహణావలోకనము చేయుచు తుదకు గ్రహణచక్రము 18 సంవత్సరముల 11 దినముల 7 గంటల 42 నిమిషము (minutes) ల కొకసారి తిరుగుచుండును; అనగా బదునెనిమిది సంవత్సరములయిన తరువాత మరల మరల ఆయాగ్రహణములే వచ్చునని తెలిసికొనిరి. అందుచే కొన్ని గంటలు హెచ్చుతక్కువగా గ్రహణములు లెక్కవేయుటయెఱింగిరి. మఱి యనేకసంవత్సరములు గ్రహణఘటికలను గనిపెట్టి నిమిషభేదముగూడ లేకుండ లెక్కవేయుట నేర్చిరి, ఇట్లు జ్యోతిశ్శాస్త్ర మంతయు ఆకాశగోళములయొక్క చలనములను వేలకొలది సంవత్సరములవఱకు అవలోకించి యవలోకించి అనేక తరములవారిచే సాధింప బడినది. జ్యోతిశ్శాస్త్రాభివృద్ధికి అవలోకనమే ముఖ్యాధారము. ఇట్లు అవలోకనమే ఆధారముగాగల శాస్త్రములు అభివృద్ధియగుటకు మిక్కిలి కాలము పట్టును. ఎందుకనగా మన మవలోకనము చేయవలసిన సృష్టిలోని వ్యాపారము మనకు నిష్టమువచ్చినప్పుడు జరగదు. అది వచ్చినప్పుడు కనిపెట్టుకొని మనము చూడవలెను. సూర్యునియందలిమచ్చలను గుఱించి కనుగొనవలెననిన, ఆమచ్చలు సూర్యునియందు సంవత్సరములో నెప్పుడు కానవచ్చునో యప్పుడు వానిని మనము పరీక్షించ వలసినదే కాని వట్టిసమయములందు నేమియు జేయ వీలులేదు.