వచ్చి మఱియొకరికి గానరాకుండునవి కావు. ఆధ్యాత్మిక శాస్త్రములలోని సిద్ధాంతములు అతీంద్రియములు; ఇంద్రియములకు దెలియునవి కావు; ఏశోధనలకును లోబడవు. కావుననే యాధ్యాత్మిక శాస్త్రములలోని సిద్ధాంతములను గుఱించి జనులందరికి నొక్కయభిప్రాయ ముండజాలదు. అందువలననే జగత్తునందిన్ని మతములును, మతభేదములును గలుగుటకు గారణమైనది. ప్రత్యక్షముగా స్థిరపడనిది భౌతికశాస్త్రములోని యేసిద్ధాంతమునైనను శాస్త్రజ్ఞు లొప్పుకొనరు. భౌతికశాస్త్రములలోని శోధనలు అందఱు జనులకును అన్ని కాలముల యందును సాధ్యములు. ఇదియే భౌతికశాస్త్రములకును ఆధ్యాత్మికశాస్త్రములకును గల భేదము.
ప్రకృతిశాస్త్రములకు బ్రత్యక్షమనగా నింద్రియజన్యజ్ఞానమే ప్రధాన మన్నందువలన ఆశాస్త్రములలో అనుమానప్రమాణము ఎంతమాత్రము గ్రాహ్యముగాదని చదువరు లనుకొనగూడదు. అనుమాన మనగా దర్కము, యుక్తి. దాని సహాయము భౌతికశాస్త్రజ్ఞులు కొంతవఱకు దీసికొనియెదరు. కాని యెంతవఱకు? ప్రత్యక్షమునకు సహకారిగాను అవిరోధిగాను ఉన్నంతవఱకు, ఇట్టి యనుమానములను ఈశాస్త్రజ్ఞులు 'ఊహ' (Hypothesis) లనియెదరు. ఇట్టి యూహల జేయుటలో బొరపా టయినయెడల భౌతికశాస్త్రములును ఆధ్యాత్మికశాస్త్రములవలెనే అతీంద్రియము లయిపోవును. కావున ఊహల జేయవలసినవిధమును, ఎట్టియూహలు భౌతిక శాస్త్రజ్ఞు లొప్పుకొనునదియు అనువిషయమును గుఱించి బహుసూక్ష్మనిబంధన లేర్పఱుపబడినవి. ఊహయొక్క సత్యత్వమును గుఱించి యెంతమాత్రము సంశయము వచ్చినను శాస్త్రజ్ఞులు దానిని వదిలివేయుదురు.
ప్రకృతిశాస్త్రకరణములు.
ప్రత్యక్షానుభవమే యీశాస్త్రములకు ముఖ్యాధారమని చదువరులు పైనివ్రాసిన సంగతులనుబట్టి గ్రహించి యుందురు. ఈ ప్రత్యక్షానుభవము శాస్త్రజ్ఞులకు రెండువిధముల గలుగును. ఒక విధమునకు అవలోకనము (Observation) అనియు, రెండవదానికి ప్రయోగము (Experiment)