పుట:Jeevasastra Samgrahamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చలనమువలన గలిగెడునుడిచే నెల్లప్పుడు కొంత నీటిప్రవాహము హైడ్రాయొక్క జీర్ణాశయములోనికి వచ్చుచు పోవుచుండును. అట్టి ప్రవాహములో చిన్న చిన్న జంతుసముదాయములు కొట్టుకొనివచ్చుచు, నవి యంతశ్చర్మకణముల పాదములచే మూల పదార్థములో నాహారముగా నిముడ్చుకొనబడును. ఈయాహారము వికారిణియందువలెనే కణములలోపల నిమిడినతరువాత కణముయొక్క మూలపదార్థమునందు జీర్ణ మగును. ఇట్టి జీర్ణ పద్ధతి కణాంతర్గతజీర్ణ (Intra-cellular digestion) మనబడును.

రెండవవిధమైన జీర్ణ పద్ధతి.

అయినను హైడ్రాయొక్క యాహారమంతయు నీరీతిగా జీర్ణము కానేరదు. ఇది పెద్దజంతువులసహితము గాలములవంటి తనమీసములతో పట్టి మ్రింగునని చెప్పియుంటిమి. అవి దిగువ జెప్పబడురీతిని జీర్ణ మగును. క్రీవాయి యను భాగమునందుండు అంతశ్చర్మకణములు గ్రంథికణములవలె నుండును. ఇవి తక్కినచోట్ల నుండువానికంటె చిన్నవిగను, సన్ననియిసుకవంటి యణువులతో నిండినవిగను ఉండి, మన జీర్ణాశయములో స్రవించు జఠరరసమువంటి యేదో యొకరసమును స్రవింపజేయునవిగా నున్నవి. ఈరసముయొక్కశక్తిచే దానియాహారములో చాలవరకు జీర్ణ మగును. ఇట్లు జీర్ణమైనయాహారము అంతశ్చర్మకణముల కవచములగుండ వానిమూలపదార్థములోనికి వ్యాపించును.

హరితకములు.

హైడ్రాలలో నాకుపచ్చ హైడ్రాలనబడెడు ముఖ్యమైనజాతి