గించెడు తొడిమవంటిగొట్టమును జేర్చి 5 లేక 6 అడుగులు పొడుగు గలిగినట్టియు, క్రమముగ సన్ననగుచు చివరభాగమున నూలుపోగువలె నంతమగునట్టియు మృదువైన రబ్బరు గొట్టమొకటి అతుకబడియున్నదని యూహింపుము. ఈ రబ్బరు గొట్టముయొక్కలోపలితట్టు వెలుపలికి వచ్చునట్లుగా తిరుగదీసి, దానిని కాలిబంతిలోపల చుట్టగా చుట్టిపెట్టితి మనుకొనుము. ఈ బంతియందలి మిగిలిన భాగమంతయును నీటివంటి ద్రవపదార్థముతో క్రిక్కిరియునట్లుగా నింపబడియున్నదని తలంపుము. అట్టిబంతిమీద నొక గ్రుద్దు గుద్దినయెడల దానిలోపల నుండు గొట్టమంతయు తిరుగబడి ఠ పేలున ఎగదన్నుకొని బయటబడును.
ఇదేప్రకారముగా తంతితిత్తియొక్క తంతువు (తీగె) యును తిత్తిలో నిముడ్చబడినదని యూహింపుము. ఆతిత్తిచుట్టును బహిశ్చర్మకణముయొక్క మూలపదార్థ మావరించియున్నది. ఆ మూలపదార్థమునందలి యొక చిన్నభాగ మొక్క చో బాణపు అలుగు (Arrow point) వలె మొనతీరి నీటిలోనికి నిగిడి యుండును (మీ). ఇది తుపాకీ మీటువంటిది. నీటిలో పరుగులిడుచుండు చిన్న చిన్న జంతువులయొక్క తాకు డీమీటునకు గలిగిన తోడనే యాస్పర్శజ్ఞాన మా కణమునందలి మూలపదార్థ మంతటను వ్యాపించి యేదో యొక విచిత్రరీతిని దానిలోపల నిమిడియుండెడు తంతితిత్తి కొత్తుడు గలుగజేయును. ఇట్టి యొత్తు డా తిత్తికి గలిగినతోడనే దానియందలి సన్ననితంతువు తటాలున ఎగదన్నుకొని బయటబడును. ఈతంతువుయొక్క కొనయం దెల్ల