Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీసములలో నొకదానిని తాకి హఠాత్తుగ జడత్వమునొంది, దాని కొన కంటుకొనిపోవును. పిమ్మట హైడ్రా యా మీసపుపోగును క్రమముగ ముడుచుకొని, తనయాహారమును నోటియొద్దకు తెచ్చుకొని, మరియొకపోగు సహాయముతో దానిని నోటిలో వేసికొనును. ఈ హైడ్రాచే మ్రింగబడిన జంతువు లొకానొకప్పుడు మిక్కిలి పెద్దవిగా నుండి దానిపొట్టకంటె లావుగా నుండున వగుటచేత, నవి యిమిడియుండు చోట హైడ్రాయొక్క పొట్ట, కప్పను మ్రింగినపాముపొట్టవలె నెత్తుగ నుబికియుండును. హైడ్రా యొక్క జీర్ణాశయము దానిమొండెము పొడుగునను గొట్టమువలె వ్యాపించియుండునని చెప్పియుంటిమి. ఈ జీర్ణాశయములో కొన్నిరసముల సహాయముచే నీ యాహార పదార్థములలో కొంతవరకు కరగి జీర్ణమగును. దీని మొండెముయొక్క మొదటికొన నెక్కడను రంధ్రము గానరాకుండుటచే, హైడ్రాకు ఆసనమార్గము ప్రత్యేకముగా లేదని చెప్పవచ్చును. జీర్ణముకాని పదార్థములు తిరిగి నోటిమార్గముననే వెలువరింపబడును.

హైడ్రా యనేకకణములకూర్పు.

హైడ్రాయొక్క మొండెమునుండి, నిలువునను, అడ్డమునను సూక్ష్మమైన తునకలు ఖండించి సూక్ష్మదర్శనితో పరీక్షించిన యెడల దానియొక్క సూక్ష్మనిర్మాణము తెలియగలదు. జంతువంతయు ననేకకణములకూర్పు. అందు ప్రతికణమును మూలపదార్థముచే నైనది. ప్రతికణమునం దొక పెద్దజీవస్థానము గలదు. అక్కడక్కడ అవకాశములును గలవు. సమస్తము లైన జంతుకణములకువలెనే యీ కణములకును కణకవచము లేదు.