పుట:Jeevasastra Samgrahamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై జెప్పినప్రకారము ఆకులన్నియు ఆహారమును ఆర్జించుకొనుచున్నవి. హరితకములు లేని కొమ్మలయందును, మూలతంతువులయందును, ఉండుకణములకు కర్బను (C) గాక యితర ఆహారపదార్థములన్నియు నీటిలో లీనమై దానితోగూడ జేరుచుండునని చెప్పియుంటిమి. కర్బను వీని కెట్లు సంపాద్యమగును? ఆకులయందలి హరితకములు గల కణములు తమకు గావలసిన ఆహారమును తాము తయారు చేసికొనుటయేకాక, ఆ వృక్షమునందలి హరితకములు లేని కణములకుసహితము కావలసిన సారజనక సంబంధమైన పదార్థములును (Nitrogenous Substances) తయారుచేయును. ఇట్లు తయారుచేయబడిన పదార్థములు ఒక కణమునుండి మరియొకకణమునకు వ్యాపించి, క్రమముగా కొమ్మలయందలి మిక్కిలి గూఢమైన మధ్యకణములకును, మిక్కిలి దూరమున నున్న మూలతంతువుల కొనలయందలి కణములకును గూడ నేకరీతిని వ్యాపించును.

ఇట్లు వ్యాపించిన ఆహారపదార్థమునందు, పాస్ట్యూరురసములో మునిగి తేలుచున్న మధుశిలీంధ్రకణములవలె నీ నాచు కణములును కణరసము (Cell Sap) అను ద్రవములో మునిగి తేలుచు దానిని తృప్తితీర త్రాగుచుండును.

శ్రమవిభాగము.

ఇట్లు హరితకములుగల కణముల సహాయముచే వేళ్లొ మొదలుగాగల భాగములయందలి కణములును, హరితకములు లేక నీటి నాకర్షించుశక్తి గల వేళ్ల యందలి కణముల తోడ్పా