(1) ఇనుము, బంగారము అను లోహములలో నేది యెక్కువ బరువు గలది యని యిద్దరికి వాదము కలిగెను. ఒకడు బంగార మెక్కువ బరువనియు, రెండవవాడు ఇనుము ఎక్కువ బరువనియు యుక్తి ప్రయుక్తులచే సిద్ధంతీకరింప జొచ్చిరి. అప్పుడు మఱియొక బుద్ధిమంతుడువచ్చి 'వ్యర్ధవాద మెందుకు? ప్రత్యక్షముగా దూచి చూడరాదా?' యని యొక ఘనాంగుళము బంగారమును, ఒక ఘనాంగుళము ఇనుమును దెచ్చి తూచి చూచెను. అప్పుడు బంగారము ఇనుముకంటె ఘనమైనది యనగా నధికమైన బరువుకలది యని వారికి నిశ్చయముగా దెలిసెను.
(2) జగత్తును సృష్టించినవాడు ఎద్దునెక్కినవాడా లేక గ్రద్దనెక్కినవాడా యని యిద్దఱు పురుషులకు వివాదము కలిగెను. వివాద తీర్చుటకు నింకొక్కడువచ్చి 'నీ వనుమాట నిజమని యెట్లు' అని యడిగెను. 'నేనన్నమాట లింగపురాణములో నున్నది' యని యొక డనినతోడనే 'నేను చెప్పినసంగతి శ్రీమద్భాగవతములోనున్నది' అని రెండవవా డనెను. అందుపై 'భాగవతము ప్రమాణము కాదు' అని మొదటివా డుత్తరము చెప్పెను. 'లింగపురాణ మంతకంటె నమ్మదగినది'కా దని వెంటనే రెండవవాడు ప్రత్యుత్తర మిచ్చెను. ఇట్లు తెగని యావాదము విని మూడవవాడు 'మీయిద్దరి పురాణములును అసత్యములు. సృష్టికర్త ఆకాశములో బెద్ద వెల్తురు నడుమ గూర్చుండును. ఇందుకు బ్రమాణమిదుగో యాతడు స్వయముగా బంపిన శుభవర్తమాన (Gospel) మని పలికి యొక బైబిలుగ్రంథమును బైట బెట్టెను! అందుపై మొదటి యిద్దఱును మూడవవానితో బోరాడ సాగిరి. ఇట్టి శైవవైష్ణవక్రైస్తవాది మతవాదములు వేలకొలది సంవత్సరములనుండి జరుగుచున్నను నేటివఱకు దెగ లేదు. ముందెన్నడైనను తెగుననెడి యాశలేదు.
పైని ఒక దానితో నొకటికి సంబంధములేని రెండు ఉదాహరణములు వ్రాయబడినవి. అందు మొదటిది భౌతికశాస్త్ర సూచకము. రెండవది యాధ్యాత్మికశాస్త్రసూచకము. ఈభిన్న శాస్త్రములకు గల భేదము తెలియుటకై మఱియొక యుదాహరణ మిచ్చెదను.