ఉపోద్ఘాతము.
దాని ధర్మములను గుఱించియు జ్ఞానము కలుగుచున్నది. కావుననే యీ పంచేద్రియములకు జ్ఞానేంద్రియములని పేరు. చిన్న నాటనుండియు నీయింద్రియములు మనకు బదార్థముల ధర్మముల దెల్పుచుండును. దీపముమీద జెయ్యిపడి చుఱుక్కనినపుడు దీపమునందు వేడిమి కలదని బాలుడు తెలిసికొనును. అగ్నిపై నీరుపడి యది చల్లారగా జూచి జలమునందు వేడిమి చల్లార్చు గుణము కలదని పిల్లవానికి దెలియును. ఇటులనే యితరపదార్థముల గుణధర్మములను గనుగొనును. మానవులకు బదార్థవిషయక జ్ఞానమంతయు నీలాగున ఇంద్రియములద్వారా కలిగినది. ఇట్టి యథార్థజ్ఞానమును ప్రత్యక్షజ్ఞాన మనియెదరు. ఇదియంతయు నొక్కచో జేర్చినయెడల నదియే ప్రకృతిశాస్త్ర మనబడును. ప్రకృతిశాస్త్రములకు భౌతికశాస్త్రము లని మాఱు పేరు.
ఆధ్యాత్మిక శాస్త్రములు.
మన దేశములో శాస్త్రము లనుపేరిట మిక్కిలి విఖ్యాతి జెందియున్నవి భౌతికశాస్త్రములు కావు. వేదములు, స్మృతులు, పురాణములు మొదలగు వానిని మనవారు శాస్త్రము లనియెదరు. వానికి ఆధ్యాత్మికశాస్త్రములు (Metaphysical Sciences) అని పేరు. ఇవి యింద్రియములకు గోచరము కాని సంగతులను బోధించును. పరమాత్మ, జీవాత్మ, స్వర్గము, నరకము, ముక్తి, పుణ్యము, పాపము అను అతీంద్రియవిషయము లీ శాస్త్రములందు జర్చింపబడును. ఇందు వర్ణింపబడిన విషయములు ప్రత్యక్షానుభవసిద్ధములు కావు. ఇందు బహుస్వల్పముగా, యుక్తియు, విశేషముగా నా ప్తవాక్యమని నమ్మికయు బ్రధానములయి యున్నవి. ఆప్తవాక్య మనగా బెద్దలు చెప్పినమాట: వేదము, బైబిల్, కురాన్ మొదలయినవి.
భౌతిక శాస్త్రములకును, ఆధ్యాత్మిక శాస్త్రములకును గలభేధము.
ఇట్టి యాధ్యాత్మిక శాస్త్రములకును భౌతిక శాస్త్రములకును గల భేదము చదువరులు చక్కగ గనుగొనియెదరు. గాక. ఈభేదము చక్కగ దెలియుటకై యీక్రింద రెండు ఉదాహరణము లిచ్చెదను:-