పదియవ ప్రకరణము.
నాచు (Moss).
మన మిదివరకు చదివిన జీవులలో కణము లెల్లయు సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు విడివిడిగా గనబడుచున్నవి. వాని వాని వ్యాపారములయందు భేదము లుండుటచే ఆయాపనులను జేయు కణములు తమతమ నిర్మాణమునందు మార్పులను జెందుచు కొన్ని పొడుగుగను, కొన్ని పొట్టిగను, కొన్ని మూలపదార్థముతో సంపూర్ణముగ నిండినవిగను, కొన్ని పెద్ద పెద్ద అవకాశములు గలవిగను ఉండి తమతమ నియమితకృత్యములను యథావిధిగా నెరవేర్చుకొనుచుండును. ఇట్టి కణవ్యత్యాసములను వారిపర్ణిలో కొంతవరకు జూచియుంటిమి. ఇంక ముందుజదువబోవు జీవులలో నింకను వ్యాపారభేదమునుబట్టి నిర్మాణవ్యత్యాసములు హెచ్చుచుండుట చక్కగ గ్రహించగలము. ఈ ప్రకరణమునందు మనము జదువు నాచు అను మొక్కయందు గొప్పవృక్షముల యందుండెడు చిక్కులు లేవు. వారిపర్ణి మొదలగువానిలో సూచింపబడిన కణవ్యత్యాసములను చక్కగా గ్రహించుటకును పిమ్మట హెచ్చు జాతిజీవులగూర్చి జదువబోవునప్పుడు వానికిని తగ్గుజాతిజీవులకును గల సంబంధములు తెలుపుటకును మిక్కిలి యుక్తమైన మధ్య మెట్టుగా నుండునట్టిదైన నాచుమొక్కను గూర్చి యిందు బోధింపబడును.