వారిపర్ణి యందు కొన్ని కణములు విభాగమై గుణనమగుచు నొకానొక ఆకారమును నిర్మించుకొనుచున్నవి. మనము ముందు జదువబోవు హెచ్చుతరగతి వృక్షములయందువలె కణకవచము దళస రెక్కుట చేవదేరుట మొదలగు విశేషమార్పులు లేకపోయినను, వారిపర్ణి యందలి కొన్ని కణములు తాము నివసించు స్థానమునుబట్టియు చేయబోవు పనులనుబట్టియు, తమ స్థితిగతులకు తగినట్లుగా తమ మూలపదార్థము కణకవచము మొదలుగాగల వానియందు కొద్దికొద్ది మార్పులను బొందుచుండును ఎట్లన వారిపర్ణి యందలికణము కొన్ని ఆకులుగాపరిణమించి యొకవిధమైన వ్యాపారమును, మరికొన్ని నులివేళ్లుగా పరిణమించి మరియొక విధమైన వ్యాపారమును చేయుచున్నవి. అనగా వారిపర్ణిలో కణవ్యత్యాసము ఈషన్మాత్రము కన్పట్టుచున్నది. ఇట్టి కణవిభాగము కణవ్యత్యాసములచేతనే కొనమొగ్గలు, ఆకులు, వేళ్లు మొదలైన వేర్పడుచున్నవి. కణగుణనమును, కణవ్యత్యాసమును సూచించుజీవులలో మనము జదువు వానియందు వారిపర్ణి మొదటిది.