పుట:Jeevasastra Samgrahamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంయుక్తబీజము ఏకకణము మధుశిలీంధ్రకణములు బూజుపోగుల బీజములవంటిది. పూర్వవారిపర్ణి బూజుపోగువంటి కణములపంక్తి. దీనినుండి కణములయొక్క ఘనసముదాయమగు వారిపర్ణి పుట్టుచున్నది. ఏకకణమగు సంయుక్తబీజమునుండి యనేక కణముల కూర్పగు వారిపర్ణి ఎట్లు ఏర్పడుచున్నదో చక్కగ గ్రహింపనగును.

కణగుణనము, కణవ్యత్యాసము.

వికారిణి, సూక్ష్మజీవులు, ఆవర్తకారి, రక్తాక్షి ఇవియన్నియు ఏక కణప్రాణు లైనప్పటికి వీనియందలి మూలపదార్థము, కణకవచము మొదలగు కొన్ని భాగములయందుండు కొన్నికొన్ని వ్యత్యాసములచే వానిని మనము ఆయాజీవులుగా గుర్తించ గలిగి యున్నాము. ఆ జీవులయం దెన్నడును అనేకకణము లుండవు. ఇందు కణగుణనము అనగా కణముల సంఖ్యయందు వృద్ధి (Cell Multiplication) లేదు. ఈ కణములు విభాగమైనను అట్లు విభాగమగుటచే నేర్పడిన కణములు విడిపోయి వేర్వేరుగా జీవించును. కాని తల్లిజీవియందలి కణముల సంఖ్యను హెచ్చింపనేరవు.

పసిరికపోగు బూజుపోగు ఇవి యొకకణ మనేక కణములుగా గుణనమగుటచే నిర్మింపబడినవి. ఇం దొక కణమునకును మరియొక కణమునకును భేదము లేదు. అనగా కణవ్యత్యాసము లేదు, కాని కణగుణనము కలదు.