Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బురుజుసమీపమున నుండును. పెద్దకణము పిండి (Starch) అణువులతో నిండియుండును. మొక్కయంతయు చిన్నకణమునుండియే పుట్టుచున్నది. పెద్దకణము ఆహారము నిలువ జేసికొను గాదెవంటిది. ఇందుండి చిన్నకణము ఆహారము గొనుచుండును. ఈ చిన్న కణమునుండి పూర్వ వారిపర్ణియను నొక మొక్క పుట్టును. అది ఎట్లన, నీ చిన్నకణము మొదట రెండుకణములుగా ఖండనము నొందును. అం దొకటి క్రిందికి పెరుగును. దీనినుండి మూలతంతువు (Root filaments) లేర్పడును. రెండవది శాఖాంత్యకణమగును. ఇది పొడుగుగానెదిగి కణములపంక్తిగా ఖండింపబడును. ఈ కణములపంక్తియే పూర్వవారిపర్ణి. కొంచెము పెరిగినతోడనే పూర్వవారిపర్ణిలో నేవో రెండుకణములు స్కంధశిరములుగా నేర్పడును. అందు క్రిందిదానినుండి నిజమైన వారిపర్ణియొక్క మూలతంతువులు ఏర్పడును. పై స్కంధశిరమునుండి ఆకులు పుట్టును. ఈ కొమ్మకు ఆకునకు నడుమనుండు పంగలో నున్న యొక కణమునుండి యొక మొటిమ పుట్టును. ఈ మొటిమ క్రమముగా నొక కణముగా ఖండింపబడును. ఈకణము వారిపర్ణియొక్క అంత్యకణము (Apical Cell) గా నేర్పడును. దీనినుండి వారిపర్ణి యంతయు పుట్టుచున్నది. కాన నీవారిపర్ణి ప్రత్యక్షముగా సంయుక్తబీజమునుండి పుట్టుట లేదు. సంయుక్తబీజమునుండి పూర్వవారిపర్ణియను మరియొక మొక్క పుట్టి దానినుండి పుట్టిన యొక శాఖ వారిపర్ణి అగుచున్నది.