ఎట్లన, తొడిమ (తొ.) స్కంధకణమువంటిది (Internode). మధ్యకణము (20-వ పటములో D. E. F. లో స్కం. శి.) స్కంధశిరకణమును బోలియున్నది. మెలికకణములు (వ్యా. క.) ఆకుల బోలియున్నవి. స్థూలబీజము (స్థూ. బీ.) శాఖాంత్యకణము.
స్థూల (ఆడ) బీజ మెట్లు ఫలించును? ఇది ఫలించుట యనగా సూక్ష్మ (మగ) బీజముతో సంయోగము నొందుట. స్థూలబీజాశయములో మధ్యమున నున్న నీ స్థూలబీజమును సూక్ష్మబీజ మెట్లు చేరును? సూక్ష్మబీజములు, బీజతంతువునందలి కణములను పగుల్చుకొని నీటియందు స్వేచ్ఛగా నీదుచుండుట జూచియుంటిమి. ఇవి వాని తోకలసహాయముచే స్థూలబీజముల నిమిత్తమై వెదకుచు నీదుకొనుచు బోయిపోయి స్థూలబీజాశయమును స్పృశించినతోడనే దాని నంటుకొని, దాని శిఖరమునందుండు రంధ్రముగుండ నాయాశయములోనికి దిగి స్థూలబీజముతో నైక్యమై దానిని ఫలింపజేయును. ఇట్టి యైక్యముచే నేర్పడిన సంయుక్తబీజమే పిండము (Embryo) అగును.
పిండోత్పత్తి.
ఇట్టి పిండోత్పత్తి కాగానే స్థూలబీజాశయమునందు కొన్ని మార్పులు గలిగి పిండాశయ మేర్పడును. ఈ పిండాశయము తొడిమనుండి ఊడి నేలబడి కొంత విశ్రమకాలము గడచిన పిమ్మట తిరిగి యుత్పత్తి యగును. ఎట్లన, ముందుగా పిండము రెండుకణము లగును. అం దొకటి చిన్నది. రెండవది పెద్దది. మొదటికణము కేవలము మూలపదార్థముతో జేయబడినదై