కొన్ని కొమ్మలుగను, కొన్ని వేళ్లుగను రూపాంతరములు జెందుటకు కారణమేమి? యని చదువరు లడుగవచ్చును. దీనికి ప్రత్యుత్తర మేమన, ఖండనముచే నేర్పడు క్రొత్తకణములన్నియు సమానముగా పెరుగక, కొన్నికొన్ని కొంతకొంతవరకు పెరిగి యంతటితో నిలిచిపోవుటయు, మరికొన్ని స్వల్పమాత్రము పెరుగగానే, చీలుటయు, నివి మొదలైనకారణములచే నీ వివిధరూపము లేర్పడుచున్నవి. ఎట్లన, స్కంధశిరకణములు అనతికాలములోనే నిలువున పెరుగుట మాని, చిన్నవిగా నిలిచియుండును. కాని స్కంధకణము లతిశీఘ్రముగా పెరిగి, తమకు ఉపాంత్యకణమునుండి ఏర్పడునప్పు డున్న పరిమాణముకంటె మూడువేల (3000) రెట్లు హెచ్చుపరిమాణము గలవగును. ఆకులుగూడ మొదట మిక్కిలి పొట్టివైన మొటిమలు. ఇవి కొంతవరకు పెరిగినపిమ్మట వాని పైభాగములు చీలి చిట్టిఆకు లగును. ఈ ఆకులు అంత్యకణమువైపునకు విల్లువంపుగా వంగి యవి అన్నియు జేరి అంత్యకణమును కప్పుటచే కొనమొగ్గ యేర్పడుచున్నది. క్రమముగా నీ మొగ్గయందలి ఆకులు విస్తరించి తమకుతరువాత పుట్టిన లేతమొగ్గకు, తా మంతకుముందు చేయు అంత్యకణసంరక్షణ నొప్పగించి తాము దూరమునకు, అనగా, క్రిందికి తొలగిపోవును.
ముదిరిన స్కంధకణమునందు జీవస్థానము లనేకము లుండునని చెప్పియుంటిమి. ఇవియును తరువాత నేర్పడినవే. బాల్యమునందు స్కంధకణమునందు గుండ్రని జీవస్థాన మొక్కటియే యుండును (19-లో 2-లో స్కం. చూడుము). స్కంధకణము