Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని కొంచె మెక్కువగాని పొడుగుగలిగి యుండును. కాని దీనిలావు ఒక నూలులో ఆరవవంతు అనగా అంగుళములో 50-వ వంతుకంటె హెచ్చుగ నుండదు. గుంటయడుగున నుండు బురదలో మూలతంతువు లనబడు కోమలమైన పోగులచే ఈ మొక్క యొక్క మొదలు తేలికగా పైపైని నాటుకొని యుండును. ఈపోగులకు నులివేళ్లనియు పేరు (A-లో ను. వే. చూడుము). తల్లికాడనుండి యక్కడక్కడ గుంపులు గుంపులుగా ముల్లు మొనలవలె నుండు కొనలుగల యాకులు వెడలుచుండును (B-లో ఆకు చూడుము). ఈ మొక్కయంతయు నీటిలో మునిగియుండి, నీటినుండియే తన యాహారమును సంపాదించు ఆకులుగలది గాన దీనికి వారిపర్ణి యనుపేరు గలిగెను.

దీని యాకులును, మూలతంతువులును పటములో A-లో జూపబడినప్రకారము కాడమీద నక్కడక్కడ గుంపులుగా నమర్పబడి యుండుటచేత, దీని తల్లికాడ కొన్ని ఖండముల (Segments) వలన నేర్పడినదిగా నూహింపవచ్చును (A-లో ఖం. చూడుము). ఆకులులేక పొడుగుగానుండుభాగము స్కంధము (Internode) ; దాని తుదనుండు కనుపువంటి పొట్టిముక్కయగు భాగము స్కంధశిరము (Node). ఈ భాగమునుండి ఆకులగుంపు వెడలుచుండును. ఈ భాగములు రెండును గలిసి యొక ఖండమగును (A-లో స్కం. స్కం. శి. చూడుము).