పుట:Jeevasastra Samgrahamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై జెప్పబడిన సంయుక్తబీజము పూర్ణముగా పెరిగినపిమ్మట దాని కణకవచము మూడుపొరలుగా విభజింపబడును. అందు నడిమిపొర యొక వింతతీరున మారి నీటిని చొరనియ్యనిదగును. అంతట నది తడిపొడులను (అనగా ఎండవానలను) లెక్క పెట్టని దై కొంతకాలము విశ్రాంతి నొంది పిమ్మట మొలకెత్తును. మొలకరించు సమయమున రెండు వెలుపలిగోడలును, మెత్తనయి ఉబ్బినవగును (D2. చూడుము). మూడవ యావరణములో నిమిడియున్న మూలపదార్థము ఆ యావరణపొరను ముందుకు త్రోసికొని ముగ్దరువలె పటములో D2. లో జూపబడినరీతిని వెలుపలి యావరణములను రెంటిని పగుల్చుకొని బయలు వెడలును. పిమ్మట నది క్రమముగా ననేక కణములుగా విభజింపబడి పసిరికపోగు రూపమును బొందును. కాన దీనియందును బూజుపోగునందునవలెనే యుక్తవయస్కములైన పోగులం దనేక కణము లున్నను అవి మొట్ట మొదట అనగా బాల్యమునం దేకకణప్రాణులుగా నుండెనని జ్ఞాపక ముంచుకొనవలయును.

పసిరిక పోగుయొక్క ఆహారము:- ఇది పూర్ణముగా హరితకముల సహాయముచే జీవించునది గాన దీని యాహారము కేవల వృక్షాహార మని చెప్పవచ్చును. ఇతరవృక్షములవలెనే యిదియును సూర్యకాంతి సహాయముచే కర్బనికామ్లవాయువును (CO2) విడదీసి యందలి కర్బనముతో నితరపదార్థముల జేర్చుకొని తమ మూలపదార్థమును తయారు చేసికొనును.


______