పురుషజాతివియు, స్త్రీజాతివియు నగు సంయోగులు వేర్వేరు పోగులలో నుండు పసిరిక పోగులకు ఏకాంగులు (Monoecious) అని పేరు. పురుషయేకాంగులు స్త్రీయేకాంగులతో సంయోగము నొందును. అట్లుగాక స్త్రీపురుషులు రెండు నొకపోగునందే యుండువానికి ఉభయాంగులు (Dicecious) అని పేరు. ఇవి అర్ధనారీశ్వర రూపముననుండు శివపార్వతులకు బోల్చదగియుండును. ఇట్లే ఏలుగుపాము మొదలగు కొన్ని జంతువులలో గూడ స్త్రీపురుషాంగములు రెండును ఏకజంతువునందే ఉండునని రెండవ భాగమునందు చదువగలరు. ఇందు సూక్ష్మస్థూల బీజములు రెండును గలవు. ఇట్టి తంతువునందలిబీజములు తమలోదామే సంయోగము నొందును. వీనిని స్వసంయోగు లందురు (Self-fertilizing gamates).
3. మూడవ విధమైన సంతానవృద్ధి:- కొన్నిపోగులలో మూలపదార్థము కణకవచమును వదలి కణమధ్యమున దళమైన సెల్లులూసుపొర కట్టుకొని సంయోగవిధానముతో నిమిత్తము లేకయే సర్వవిషయముల సంయుక్తబీజమును బోలియుండును (పటములో D1. చూడుము). ఇట్టి బీజములకు సిద్ధ బీజములు (Spores) అని పేరు. కాని యీ సిద్ధబీజము తిరిగి మొలచునో మొలవదో కొంచె మనుమానముగా నున్నది. అయినను పసిరిక పోగులలో గాకపోయినను ఇతరజీవుల కొన్నిటియందు పురుష సంయోగము లేకయే ఫలించు స్థూలబీజములు గలవని కొందరు నిష్కర్షించియున్నారు. ఇట్టి సంతానవృద్ధికి కన్యాగర్భ మని పేరు (Parthenogenesis).