ఎనిమిదవ ప్రకరణము.
పసిరికపోగులు (Spirogyra).
నిలువ నీరుండు గుంటలయందును, మెల్లగా ప్రవహించు కాలువలయందును, తేలుచుండు పచ్చని తెట్టెవంటి తుక్కులో తక్కిన యన్నిజాతులకంటె తరుచుగ నుండెడు మిక్కిలి సన్నని పొడుగుపాటి కొంచె మాకుపచ్చని దారములకు పసిరికపోగు లని పేరు. ఇం దొకపోగును సూక్ష్మదర్శనిలో పరీక్షించినయెడల మరమేకుచుట్లవలె క్రమముతప్పక చుట్టిచుట్టివచ్చు ఆకుపచ్చనిపట్టెలు (Bands) దారముయొక్క లోతట్టున చుట్టు వ్యాపించియున్నట్టు తెలియగలదు (15-వ పటములో A. చూడుము).
సూక్ష్మ నిర్మాణము.
సూక్ష్మదర్శనిలో పరీక్షించునప్పుడు బూజుపోగునందు వలెనే దీనియందును కణములు ఒక్కటేపంక్తిగా నొకదానిప్రక్క నొకటి చేరియున్నట్టు తెలియగలదు. కాని బూజు పోగునకును పసిరికపోగునకును ఆకారమునందు భేదము లెవ్వియన, బూజుపోగునందు తరుచుగ శాఖ లుండును. అనగా ఒకపోగునుండి అనేక పిల్లపోగులు పుట్టుచుండును. అదిగాక ఆపోగుల మొదలు మొండిగను, చివర సన్నముగ నాదోకకగను ఉండును (12-వ పటములో B1. B2. చూడుము).